Sunday, April 13, 2025
HomeAP జిల్లా వార్తలువిశాఖపట్నంGVMC: గ్రేటర్ విశాఖలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరేందుకు సిద్ధమైన కార్పొరేటర్..!

GVMC: గ్రేటర్ విశాఖలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరేందుకు సిద్ధమైన కార్పొరేటర్..!

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్ హరివెంకట కుమారి అవిశ్వాసం రాజకీయంగా రసవత్తర మలుపులు తీసుకుంటోంది. ఈ సందర్భంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకులు మీద షాకులు తగులు తున్నాయి. తాజాగా గాజువాకకు చెందిన 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీ రెడ్డి, తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. దీంతో అవిశ్వాస తీర్మానం ముందు కూటమికి ఊహించని ఆత్మవిశ్వాసం లభించినట్టు అయింది.

- Advertisement -

వంశీ రెడ్డి కుటుంబం రాజకీయంగా వైసీపీలోనే ఉండగా, ఇప్పుడు వంశీ టీడీపీలోకి చేరేందుకు ముందడుగు వేయడం ఆసక్తికరంగా మారింది. ఆయన తండ్రి తిప్పల నాగిరెడ్డి 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఓడించిన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన సోదరుడు దేవన్ గాజువాక వైసీపీ ఇంచార్జ్‌గా కొనసాగుతున్నా, వంశీ మాత్రం పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఈ పరిణామాలతో టీడీపీ-జనసేన కూటమికి మరింత బలం చేకూరినట్లైంది. ఇప్పుడే మరో ముగ్గురు కార్పొరేటర్లను తమవైపు తిప్పగలిగితే, అవిశ్వాసం నెగ్గించే మ్యాజిక్ ఫిగర్ చేరుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, వంశీ కృష్ణ యాదవ్ లు వంశీ రెడ్డితో హోటల్‌లో కీలక చర్చలు జరిపారు.

అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ఇంకా రెండు ఓట్లు అవసరం ఉన్నప్పటికీ, టీడీపీ నేతలు మేయర్ పదవి తమదే అనే ధీమాతో ఉన్నారు. అయితే, అవిశ్వాసం తేటతెల్లమైన తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల పంపకాల విషయంలో కూటమిలో ఏకాభిప్రాయం ఇంకా ఏర్పడలేదు. డిప్యూటీ మేయర్ హోదాపై స్పష్టత లేకుండా క్యాంప్ రాజకీయాల్లో పాల్గొనబోమని జనసేనకు చెందిన కొందరు కార్పొరేటర్లు చెప్పినట్టు సమాచారం.

ఇక రాజకీయ ఉత్కంఠ మరింత పెరిగేలా, క్యాంప్ రాజకీయాలు విదేశాలకు పాకాయి. టీడీపీ కార్పొరేటర్లు మలేషియాకు వెళ్లినట్టు, వైసీపీ వర్గం శ్రీలంకలో మోహరించినట్టు తెలుస్తోంది. కమ్యూనిస్టు పార్టీలకు చెందిన ఇద్దరు సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉండనున్నారని సమాచారం. అవిశ్వాస తీర్మానం తుది ఫలితం ఏవిధంగా ఉండబోతుందన్నది ఏప్రిల్ 19న జరిగే జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో తేలనుంది. మేయర్ హరివెంకట కుమారి పీఠం నిలబడుతుందా.. కూటమి బలంగా బయటపడుతుందా.. అనే ప్రశ్నకు ఆ రోజే జవాబు దొరకనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News