విశాఖపట్నం నగర పాలక సంస్థలో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం చుట్టూ రాజకీయ వేడి రాజుకుంటోంది.గ్రేటర్ మేయర్ పదవిని చేజిక్కించుకునేందుకు కూటమి పార్టీల సమన్వయం ముమ్మరంగా సాగుతోంది. ఇదే సమయంలో నగర రాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 74వ వార్డు కార్పొరేటర్ వంశీరెడ్డి జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది.
అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణను కలిసిన వంశీరెడ్డి, జనసేనలో చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఆయన చేరిక కూటమి గణాంకాలకు బలాన్ని చేకూర్చనుండగా, వైసీపీకి ఇది ఎదురు దెబ్బ తగలనుంది.
అవిశ్వాస తీర్మానం నెగ్గించాలంటే 74 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇప్పటికే కూటమికి 70 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మరో నాలుగుగురి మద్దతు లభిస్తే, మేయర్ పదవిని తమవైపు తిప్పుకునే అవకాశాలు మెరుగవుతాయి. ఈ నేపథ్యంలో, కూటమి ఎమ్మెల్యేలు ఇవాళ అత్యవసరంగా సమావేశమయ్యేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు, అధికార వైసీపీ వద్ద 33 మంది కార్పొరేటర్లు ఉండగా, ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులు మద్దతుగా ఉన్నారు. అయితే పార్టీకి లోపలి అసంతృప్తి, బయట ఉన్న రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వారి వైఖరిపై అనిశ్చితి నెలకొంది.
ఇక పార్టీల క్యాంప్ పాలిటిక్స్ కూడా ఊపందుకున్నా, చాలామంది కార్పొరేటర్లు హాజరు కావడం లేదు. ఈ రాజకీయ గందరగోళంలో సీపీఐ మాత్రం ఓటింగ్‌లో పాల్గొనాలా లేదా అన్న విషయంలో స్పష్టత ఇవ్వక రాష్ట్ర కమిటీ నిర్ణయానికి వదిలేసింది. ఈ క్రమంలో విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానం, తుది ఓటింగ్‌కు ముందు మరిన్ని రాజకీయ సమీకరణాలు మారే అవకాశముంది.