Sunday, February 23, 2025
HomeAP జిల్లా వార్తలువైయస్ఆర్ కడపOutstanding award: వైఎస్ఆర్ జిల్లాకు అత్యుత్తమ పురస్కారం

Outstanding award: వైఎస్ఆర్ జిల్లాకు అత్యుత్తమ పురస్కారం

ఆకాంక్షిత జిల్లాల (Aspirational Districts)అభివృద్ధి సాధనలో భాగంగా ఆర్థిక పరిపుష్టితో పాటు అన్ని ప్రమాణికాలలో వైఎస్ఆర్ జిల్లా ముందంజలో కొనసాగడం అభినందనీయం అని కేంద్ర ఆర్థిక సేవారంగ డిప్యూటీ డైరెక్టర్ జెనరల్ ఎం. జి. జయశ్రీ అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అధ్యక్షతన.. ఆకాంక్షిత జిల్లాలో “ఆర్థిక పరిపుష్టి – కీ పర్ఫార్మెన్స్ ఇండిక్టేటర్” అనే అంశంపై బ్యాంకు అధికారులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం జరిగింది.

- Advertisement -

ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి ఆర్థిక సేవారంగ డిప్యూటీ డైరెక్టర్ జెనరల్ ఎం. జి. జయశ్రీ ముఖ్య అతిథిగా హాజరు కాగా వారితో పాటు కెనరా బ్యాంక్ డిజిఎం ఆర్తి అగర్వాల్, ఎస్.ఎల్.బి.సి. కన్వీనర్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ జెనరల్ ఎం. జి. జయశ్రీ మాట్లాడుతూ ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి సాధనలో భాగంగా ఆర్థిక పరిపుష్టి, నైపుణ్య అభివృద్ధి అనే అంశాల్లో అత్యుత్తమ పనితీరును కనబరిచినందుకు వైఎస్ఆర్ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం “నీతీ ఆయోగ్” ద్వారా అత్యుత్తమ పురస్కారం బహుకరించడం అభినందనీయం అన్నారు.

దేశవ్యాప్తంగా 112 ఆకాంక్షిత జిల్లాల్లోని 36 జిల్లాలకు ఈ అత్యుత్తమ పురస్కారం వరించగా.. అందులో వైఎస్ఆర్ జిల్లా కూడా ఒకటిగా పురస్కారాన్ని అందుకోవడం గర్వించదగ్గ విషయం అన్నారు. అందుకోసం సంబందిత అన్ని రకాల ప్రమాణికాలలో అత్యుత్తమ సేవలు, అన్ని రకాల లక్ష్యాలను సాధించడంలో జిల్లా యంత్రాంగం చేపట్టిన నిర్దిష్ట ప్రణాళికలు, క్షేత్రస్థాయిలో ఆయా శాఖల జిల్లా అధికారుల కృషి అభినందనీయం అన్నారు. ఆకాంక్ష జిల్లాల లక్ష్య సాధనలో ఆర్థిక పరిపుష్టి అనే ప్రమాణిక పాత్ర 10% శాతమే అయినా.. బ్యాంకర్ల సహకారం ఎంతో కీలకమైనదన్నారు. ఇప్పటి వరకు ఆకాంక్షిత జిల్లాల లక్ష్య సాధనలో వైఎస్ఆర్ జిల్లాకు నిర్దేశించిన అన్ని రంగాల్లో పురోగమనంలో ముందుకు సాగడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

బ్యాంకర్లు సమర్థవంతంగా పని చేస్తేనే.. ఆర్థిక వ్యవస్థ మరింత దృఢంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా జిల్లాలో డీఆర్డీఏ, మెప్మా పరిధిలోని అన్ని స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసి.. జిల్లా ఆర్థిక అభివృద్ధిలో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నాయని… ఈ విషయంలో డిఆర్డీఏ, మెప్మా శాఖల అధికారులు స్వయం సహాయక సంఘాల్లో ఆసక్తిని, బిజినెస్ స్కిల్స్ ను అభివృద్ధి చేయాలన్నారు. అందుకోసం బ్యాంకర్లు పొదుపు సంఘాల మహిళలకు రుణాలు అందించి.. ఆర్థిక చేయుతనివ్వాలన్నారు.

జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాలతో పాటు వికలాంగులు, వృద్ధాప్య, ఎఫ్.పి.ఓ., రాగ్ పికర్స్, చిరు వ్యాపారుల గ్రూపులను ఏర్పాటు చేసి.. వారి జీవన ప్రమాణాలను, ఆర్థిక స్థితిని మెరుగు పరచాలన్నారు. సమాజిక భద్రతలో భాగంగా.. వృద్ధాప్య మహిళా సంఘాలను ఏర్పాటు చేసి.. ఆయా సంఘాల పటిష్టతకు కృషి చేయాలన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని.. అందుకు సంబంధించి అన్ని రకాల బ్యాంకు శాఖలు ఆయా పట్టణ, గ్రామీణ పరిధిలో రుణ పథకాలకు అర్హత పొందిన లబ్దిదారులకు లబ్ధి చేకూర్చాలని బ్యాంకు అధికారులను సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు, వైద్య ఆరోగ్య శాఖలు, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖ ద్వారా.. వారికి నిర్దేశించిన ప్రమాణికాల ఆధారంగా బ్యాంకుల సహకారంతో జిల్లా ఆర్థిక పరిపుష్టి పెంపొందించాలన్నారు.

కార్యక్రమంలో ముందుగా జేసీ అథితి సింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడం, బ్యాంకింగ్ యాక్సెస్‌ను విస్తరించడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంతో పాటు విస్తృతంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం, ప్రజలను ఆర్థికంగా చైతన్యవంతం చేయడం, సామాజికంగా శక్తివంతం చేయడంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని, జిల్లా పరిపాలన యంత్రాంగం, ఆయా శాఖల అధికారులు కూడా నిబద్ధతతో పనిచేస్తున్నారన్నారు.

జిల్లా ఆర్థిక రాబడులను పెంచే లక్ష్యాలను నిర్దేశించుకుని, అన్ని రంగాల్లో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి.. మెరుగైన ఉపాధి అవకాశాలను సృష్టించడంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన 10 రూపాయల నాణేలను మార్కెట్లో సులభంగా చెలామణి అయ్యేలా వ్యాపారులకు అవగాహన పెంచాలని.. జిల్లా యంత్రాంగం బ్యాంకర్లను ప్రోత్సహించిందన్నారు. జిల్లాలో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం, ప్రజల సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడమే లక్ష్యంగా వినూత్న వ్యూహాలతో చురుకైన పాలన సాగించడం జరుగుతోందన్నారు.

అనంతరం జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన పలురకాల ఋణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని, ఆకాంక్షిత జిల్లా లక్ష్య సాధనలో భాగంగా కీ పాయింట్ ఇండిక్టేటర్స్ పై ఆయా బ్యాంకుల ప్రతినిధులతో డిప్యూటీ డైరెక్టర్ జెనెరల్ సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు చీఫ్ మేనేజర్ జనార్దనం… సమావేశంకు సంబంధించిన అజెండా, వివరాలను, పలు శాఖల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న రుణాల ప్రగతిని వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News