కడప జిల్లా జడ్పీ చైర్మన్(ZP Chairmen)గా వైసీపీ బ్రహ్మంగారిమఠం జడ్పిటిసి (ZPTC) సభ్యులు రామ గోవిందరెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎన్నిక ప్రత్యేక సమావేశం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి నేతృత్వంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ ఓబులమ్మ పాల్గొన్నారు.

ముందుగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి కడప జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పదవి కి అభ్యర్థిని ప్రతిపాదించాలని జెడ్పీటీసీ సభ్యులను కోరడంతో.. పోరుమామిళ్ల జడ్పిటిసి సభ్యులు ముత్యాల ప్రసాద్ చెన్నయ్య, వేముల జడ్పీటీసీ కోకటం వెంకట బయపురెడ్డిలు బి. మఠం జెడ్పీటీసీ సభ్యులు ముత్యాల రామగోవింద రెడ్డి పేరును ప్రతిపాదించడంతో పాటు ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచారు.

తదుపరి ఏ ఒక్క అభ్యర్థి పేరును కూడా ప్రాదేశిక సభ్యులు ప్రతిపాదించకపోవడం, వైఎస్ఆర్సిపికి చెందిన ప్రాదేశిక సభ్యుల కోరం కూడా సరిపడా ఉండడంతో.. బి.మఠం మండలానికి చెందిన ముత్యాల రామ గోవిందా రెడ్డిని వైఎస్ఆర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించడం జరిగింది. అనంతరం వైఎస్ఆర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ముత్యాల రామ గోవింద రెడ్డితో.. జిల్లా కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది.

అమలులో వున్న శాసనం, రాజ్యాంగం పట్ల శ్రద్ధతో స్వీకరించ బోవు బాధ్యతలను సత్యనిష్టతో భగవంతుని సాక్షి గా నిర్వహిస్తానని జడ్పీ చైర్మన్ గా ఎన్నికైన ముత్యాల రామ గోవిందరెడ్డితో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ప్రమాణ స్వీకారం చేయించారు.
అంతకుముందు ఉదయం 10 గంటలకు బ్రహ్మంగారిమఠం జడ్పిటిసి సభ్యుడు ముత్యాల రామ గోవిందరెడ్డి జడ్పీ సీఈఓ ఓబులమ్మకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయన వెంట కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డా. దాసరి సుధా, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఆర్.వి రమేష్ యాదవ్, యం వి.రామచంద్రారెడ్డి,డిసీ గోవింద రెడ్డి,ఇతర నేతలు పాల్గొన్నారు.

జిల్లాలో మొత్తం 50 మంది జెడ్పీటీసీ సభ్యులుండగా ఇందులో పులివెందుల జెడ్పీటీసీ, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలు ఖాళీ ఏర్పడగా ప్రస్తుతం జిల్లా పరిషత్లో 48 మంది జెడ్పీటీసీ సభ్యులున్నారు. వారిలో గోపవరం మండల జెడ్పీటీసీ జయరామిరెడ్డి మాత్రమే తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికయ్యారు. మిగతా అందరూ వైసీపీ నుంచి ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులే వుండడంతో జడ్పిటిసి అధ్యక్ష ఎన్నిక లాంఛన ప్రాయంగా ముగిసింది.