అదానీ గ్రూప్ షేర్స్ ఈరోజు షేర్ మార్కెట్లో కుప్ప కూలాయి. దీంతో అదానీ షేర్స్ పతనం ఈరోజు కూడా కొనసాగింది. ఓవైపు పార్లమెంట్ లో అదానీ గ్రూప్ అవకతవతకలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి, శిక్షించాలంటూ ప్రతిపక్షాలంతా పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్న వేళ ఇటు షేర్ మార్కెట్లోనూ అదానీకి గడ్డు పరిస్థితి తప్పలేదు. దీంతో అదానీ గ్రూప్ నష్టాలు 100 బిలియన్ డాలర్స్ దాటిపోయింది. ఇప్పటికే గ్రూప్ ఫ్లాగ్ షిప్ షేర్ సేల్ ను అదానీ స్వచ్ఛందంగా విరమించుకుని, ఇందుకు గల కారణాలను స్వయంగా వివరించినా ఉపయోగం లేకపోయింది. మరోవైపు ఆర్బీఐ కూడా అదానీ గ్రూప్ ను వాచ్ లిస్టులో పెట్టింది. భారతీయ బ్యాంకులన్నీ అదానీ గ్రూపులోని సంస్థలకు ఇచ్చిన మొత్తాల వివరాలను కోరింది.
స్టాక్ మార్కెట్లో ఉన్న తీవ్ర ఒడిదుడుకుల కారణంగా 20,000 కోట్ల రూపాయల అదానీ ఎంటర్ ప్రైజెస్ ఎఫ్పీఓను అదానీ ఉపసంహరించుకోవటం షాకింగ్ నిర్ణయంగా మారింది. నైతికంగా ఇది సరైనది కాదని అదానీ బోర్డు భావించటమే ఇందుకు కారణం అని గౌతం అదానీ స్వయంగా వీడియో మెసేజ్ లో వెల్లడించినా షేర్ మార్కెట్లో మాత్రం దీన్ని విశ్వసించేందుకు ఎవరూ సిద్ధంగా లేకపోవటం విశేషం.