నేను రాత్రికి రాత్రి ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించలేదంటూ బిగ్ విగ్ గౌతమ్ అదానీ క్లారిటీ ఇవ్వటం విశేషం. ప్రస్తుతం తన స్థితి వెనుక 30 ఏళ్ల మోడీ జమానాలో బాగుపడింది కేవలం అదానీ, అంబానీనే అంటూ ఇంతకాలం సాగుతున్న ప్రచారంపై ఎన్నడూ నోరు విప్పని ఈ బిజినెస్ టైకూన్ సడన్ గా తన గతన్నంతా సీరియస్ గా గుర్తుచేశారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే కెరీర్ స్టార్ట్ చేసినట్టు, రాజీవ్ ప్రవేశపెట్టిన ఎగ్జిమ్ పాలసీ లబ్దిదారుల్లో తాను ఒకడినంటూ అదానీ చెప్పుకొచ్చారు. ఇక ఆతరువాత వచ్చిన పీవీ నరసింహా రావు, మన్మోహన్ సింగ్ లు అనుసరించిన ఆర్థిక విధానాలతో బోలెడంత లబ్ది పొందినట్టు అదానీ వివరించారు. మోడీ తాను ఒకే రాష్ట్రానికి చెందినవారమన్న ఏకైక కారణంతో తనపై ఇన్ని ఆరోపణలు వస్తున్నాయని గౌతం అదానీ విషయం లోతుల్లోకి వెళ్లారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఇది దురదృష్టకరం అంటూ ఆయన విచారం వ్యక్తంచేశారు.
ఇక తన బిజినెస్ జర్నీలో రాజీవ్ హయాంలోని ఎగ్జిమ్ పాలసీ ఒక కీలక దశ కాగా రెండవ కీలక దశ 1991లో పీవీ అనుసరించిన ఆర్థిక సరళీకరణ విధానాలని, మూడవ టర్నింగ్ పాయింట్ గుజరాత్ సీఎంగా బీజేపీకి చెందిన కేశూభాయ్ పటేల్ సీఎం అయ్యాక వచ్చిన పారిశ్రామిక విధానాలని స్వయంగా వివరించారు అదాని. తన కెరీర్ లో నాలుగవ దశగా 2001ని చెబుతానన్న ఆయన మోడీ సీఎం అయ్యాక గుజరాత్ లో పారిశ్రామిక ప్రగతి పరుగు లంకించుకుందని ఇందులో తాను కూడా ఒక పారిశ్రామిక వేత్తగా నిలిచినట్టు తెలిపారు. తనకు స్ఫూర్తి ధీరూభాయ్ అంబానీనే అంటూ అదానీ చెప్పటం విశేషం.