ఆర్థికంగా పరిస్థితులు బాలేవు..అంతర్జాతీయ మాంద్యం పొంచే ఉంది ఈ నేపథ్యంలో టెక్ జెయింట్ అమెజాన్ మరో 18,000 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతోంది. ఇలాంటి కఠిన నిర్ణయాలతో తమ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందుల పాలవుతారనే విషయం తాము తేలికగా తీసుకోవటం లేదని అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ చెప్పుకొచ్చారు. ఆన్ లైన్ రీటైల్ జెయింట్ అమెజాన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఇటీవలి కాలంలో ఇదేం మొదటిసారి కాకపోయినా ఈ బాటలో మరికొన్ని సంస్థలు పయనించటం ఖాయంగా మారింది. 2020-2022 మధ్య కాలంలో రెట్టింపుకు పైగా స్టాఫ్ ను అమెజాన్ నియమించుకోగా ప్రస్తుతం లే ఆఫ్స్ యూరప్ లో ఎక్కువగా ఉండనున్నట్టు తెలియజేసింది. గతేడాది సెప్టంబరు నెలాఖరుకల్లా 1.54 మిలియన్ ఉద్యోగులు ఈ సంస్థలో ఉండగా వీరికి అదనంగా ‘సీజనల్ వర్కర్స్’ ను అమెజాన్ నియమించుకుంది. హాలిడే సీజన్ లో మాత్రమే సీజనల్ వర్కర్స్ కు పని ఉండేలా ఒప్పందం చేసుకుంది అమెజాన్.