హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ సహకారంతో వింగ్స్ మీడియా, G5 మీడియా గ్రూప్‌తో కలిసి “మొదటి ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ సాధించడం ఎలా“ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు.
మెరిట్ కు హద్దులుండవు
“మెరిట్ సాధించడానికి ఎలాంటి సరిహద్దులు ఉండవు” అని 21st సెంచరీ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ అన్నారు. తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ గురించి ఉదాహరణగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ)లో 10 ఏళ్ల పాటు సేవలందించిన ఏకైక మహిళా అధికారిణిగా నిలిచారని ఆయన చెప్పారు. సమాజానికి ఆమె చేసిన విశేషమైన సేవలను కొనియాడుతూ, ప్రజలకు సేవ చేయడానికి ఆమె తన స్వంత తెలివిని ఎలా ఉపయోగించారో విద్యార్థులకు వివరిస్తూ, ఇదంతా ఐఏఎస్ సాధించడం ద్వారా తనకి వచ్చిన అధికారంతో సాధ్యం అయిందని విద్యార్థులకు చెప్పారు.

కష్టమనే అపోహలెందుకు?
21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చీఫ్ మెంటర్ డాక్టర్ భవానీ శంకర్ మాట్లాడుతూ
యూపీఎస్సీ పరీక్షల్లో ప్రాథమిక పాఠశాల ప్రశ్నలు ఉంటాయని, క్లిష్టమైన ప్రశ్నలతో కూడుకున్నదనే అపోహను తొలగించాలని విద్యార్థులకు వివరిస్తూ, ప్రిపరేషన్ కోసం ఎన్.సి.ఇ.ఆర్.టి. పుస్తకాలు ఉపయోగపడతాయని చెప్పారు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
కాలేజ్ చైర్మన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ, 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ సహకారంతో సివిల్ ఆస్పిరెంట్స్ క్లబ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. మున్ముందు తమ కాలేజీ నుండి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తయారు చేయడానికి తమ వొంతు కృషి చేస్తామని తెలిపారు.

కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి, డైరెక్టర్ జనార్దన్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్, టీపీఓ డాక్టర్ జయప్రకాష్, వింగ్స్ మీడియా అండ్ జీ5 మీడియా గ్రూప్ డైరెక్టర్ గిరి ప్రకాష్, గీతా అడ్వర్టైజింగ్ ఎండీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.