“మొదటి ప్రయత్నంలో సివిల్ సర్వీసెస్ సాధించడం ఎలా ” అనే సదస్సును జి. నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ లో విజయవంతంగా నిర్వహించారు. వింగ్స్ మీడియా, G5 మీడియా గ్రూప్ సంయుక్తంగా ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సివిల్స్ రాసేవాళ్లలో ఇంజినీర్స్ ఎక్కువ
యూపీఎస్సీ మాజీ చైర్మన్ డా. డి.పి. అగర్వాల్ విద్యార్థులతో మాట్లాడుతూ, సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయాన్ని సాధించేందుకు దృఢ సంకల్పం, పట్టుదల ఎంతగానో అవసరమని వివరించారు. ప్రతిదీ పెద్దగా ఆలోచించే మంత్రాన్ని పాటిస్తూ కెరీర్ లో మంచి నాయకులుగా ఎదగాలనే లక్ష్యాన్ని మదిలో పెట్టుకోవాలని ఆయన అన్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు అధిక సంఖ్యలో ఇంజినీరింగ్ విద్యార్థులు హాజరవుతున్నారని, ప్రతి సంవత్సరం దాదాపు మూడు లక్షల మంది ఇంజినీర్లు పరీక్ష రాస్తున్నారని ఆయన తెలిపారు.
ఉదాహరణగా కృష్ణతేజ ఐఏఎస్
ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఛైర్మన్ పి. కృష్ణప్రదీప్ మాట్లాడుతూ, సివిల్ సర్వెంట్స్ కు ఉన్న అధికారాన్ని వివరించారు. 2008లో కేరళలో వచ్చిన మహా వరదల్లో 2.5 లక్షల మంది ప్రజలను కేవలం 48 గంటల్లోనే సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఐఏఎస్ అధికారి కృష్ణ తేజను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, సమాజ సేవలో ఒక అధికారి ఎలాంటి ప్రభావాన్ని చూపగలడో వివరించారు. ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ చీఫ్ మెంటార్ డా. భవాని శంకర్ యూపీఎస్సీ పరీక్షపై పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. సివిల్స్ లో విజయం సాధించాలంటే క్రమశిక్షణ చాలా అవసరం అన్నారు.

జీఎల్ఐటీఎస్ (GNITS) అల్యూమ్నీ రిలేషన్స్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డీన్ డా. బి. వెంకటేశులు, కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ సివిల్స్ ఆస్పిరెంట్స్ క్లబ్ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. యుపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి కాలేజ్ ప్రిన్సిపాల్ డా. కె. రమేశ్ రెడ్డి, డీన్ (అడ్మినిస్ట్రేషన్) జి.వి. అవధాని, వింగ్స్ మీడియా ఎడిటర్ గణేశ్, అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు.