హైదరాబాద్‌లో మరో సారి రియల్‌ఎస్టేట్ బూమ్ ఆకాశాన్ని అంటింది. ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్‌కు సాటి రాగల సిటీ మరోటి లేదని మరోమారు చాటి చెప్పింది. రెసిడెన్షియల్ ప్రాపర్టీలు … వాణిజ్య సముదాయాలు ..ఆఫీసులకు కూడా హైదరాబాద్ సిటీలో డిమాండ్ తీవ్రస్థాయిలో ఉంది. సామాన్యుడు నుండి సంపన్నుల వరకు అన్ని తరగతి వర్గాల ప్రజలు హైదరాబాద్‌లో సొంతిల్లు .. సొంత కార్యాలయాలు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. దీంతో .. ముంబై, బెంగళూరు నగరాలను హైదరాబాద్ అధిగమించింది. రెసిడెన్షియల్ ప్రాపర్టీలు .. కొత్త ప్రాజెక్టుల ప్రారంభంలోనూ హైదరాబాద్ టాప్ 3 ప్లేస్ దక్కించుకోవడం విశేషం.
హైదరాబాద్ సిటీ మరోసారి రియల్ ఎస్టేట్ రంగంలో తన సత్తా చాటింది. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్‌తో పోటీ పడగల సిటీ మరోటి లేదని రుజువు చేసింది. సొంత ఇంటి కలలు సాకారం చేసుకోవడానికి మధ్యతరగతి ప్రజలు హైదరాబాద్‌కే ఓటేశారు. స్టార్టప్‌లు ప్రారంభించే ఔత్సాహిక యువ వ్యాపారవేత్తలు హైదరాబాద్‌నే అడ్డాగా ఎంచుకుంటున్నారు. దీంతో .. రికార్డు స్థాయిలో ఆఫీసు కార్యాలయాలు అమ్ముడవుతున్నాయి. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ అత్యంత మెరుగైన స్థానంలో ఉండడంతొ ఈ ఏడాది రియల్ ఎస్టేట్ రంగంలో ముంబయి, బెంగళూరును కూడా అధిగమించింది.
మౌలికవసతులు .. ఐటీ పరిశ్రమ
హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ వేగంగా పుంజుకోవడానికి. పలు కారణాలు ఉన్నాయి. అత్యద్భుతమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఐటీ పరిశ్రమ పుంజుకోవడం ప్రధానకారణాలు. దేశం నలుమూలల నుండి ఉద్యోగ, ఉపాథి అవకాశాల కోసం మహానగరానికి వస్తున్న యువ నిపుణుల జనాభా సంఖ్య కూడా హైదరాబాద్ రియల్ రంగంలో కీలకభూమిక పోషిస్తోంది. దీంతో రియల్ ఎస్టేట్ రంగంలో రారాజుగా మరోసారి సత్తా చాటింది హైదరాబాద్. 2022 క్యాలెండర్ సంవత్సరంలో, రెసిడెన్షియల్ ప్రాపర్టీ , కొత్త ప్రాజెక్టుల ప్రారంభంలోనూ హైదరాబాద్ టాప్-3లో నిలిచింది. ముంబై, బెంగళూరు సిటీలను హైదరాబాద్ అధిగమించినట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ప్రాప్‌ఈక్విటీ ఒక నివేదికలో వెల్లడించింది.
ప్రాప్‌ఈక్విటీ ప్రకారం, హైదరాబాద్‌లో 66 వేల 683 నూతన యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఇది బెంగళూరు, ముంబయి సంఖ్యలతో పోలిస్తే చాలా ఎక్కువ.చెన్నైని కూడా హైదరాబాద్ అధిగమించింది. 81,849 యూనిట్ల ప్రారంభోత్సవంతో థాణె మొదటి స్థానంలో ఉంది 69,525 యూనిట్ల ప్రారంభంతో పుణె రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో హైదరాబాద్ ఉండడం విశేషం. దేశవ్యాప్తంగా, రెసిడెన్షియల్ ప్రాపర్టీ అంటే నివాస గృహాల అమ్మకాల్లో ముంబై మొదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్ రెండో స్థానం సంపాదించింది.
మెట్రో నగరాల్లో పరిశీలిస్తే 2022 సంవత్సరంలో టైర్-1 నగరాల్లోని నివాస గృహాల అమ్మకాలు టైర్-2 నగరాల కంటే 250 శాతం ఎక్కువగా నమోదైనట్లు ప్రాప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ జసుజా వెల్లడించారు. టైర్-1 నగరాల్లో గతేడాది 4.53 లక్షల యూనిట్ల అమ్మకాలు జరగ్గా, టైర్-2 నగరాల్లో ఈ సంఖ్య 1.83 లక్షలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. టైర్-2 నగరాలతో పోలిస్తే, టైర్ 1 నగరాల్లో మెరుగైన జీవన ప్రమాణాలు, మెరుగైన మౌలిక సదుపాయాల కారణంగా అమ్మకాలు ఎక్కువగా జరిగినట్లు ఆయన వివరించారు.
ఇక తెలంగాణ రాజధాని నగరంలో రియల్ ఎస్టేట్ వృద్ధి చెందడానికి.. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు కూడా ప్రధాన కారణంగా చెప్పిందీ రియల్ ఎస్టేట్ కంపెనీ. కొనుగోలుదారులు ఇంకా ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో, రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు మరింత డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉందని, అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగే అవకాశాలు ఉన్నాయని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంటున్నారు. గత మూడేళ్లతో పోలిస్తే, ఈ ఏడాది రియల్ ఎస్టేట్ రంగం దేశవ్యాప్తంగా పుంజుకుందని నిపుణులు అభిప్రాయ పడ్డారు.
పెద్ద ఆఫీసులకు .. క్యూ కడుతున్న కంపెనీలు
– హైఎండ్ ఆఫీస్‌లకు పెరిగిన డిమాండ్
– 10 వేల చ. అ. ఆపైన ఉన్న ఆఫీసులకు డిమాండ్
– 25 శాతం 50వేల చ.అ. ఆఫీసుల కొనుగోళ్లు
– లక్ష చ.అ. ఆఫీసుల కొనుగోలు 22శాతం
– వ్యాపారాల విస్తరణకు హైదరాబాద్ ఫస్ట్ చాయిస్
– అందుబాటులో నిపుణులైన యువజనాభా
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిలో దూసుకెళ్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద కంపెనీలు భాగ్యనగరంలో ఆఫీసులు తెరిచేందుకు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పెద్ద ఆఫీసు స్థలాలకు మొదటి ఆప్షన్‌గా మారింది. దిల్లీ, బెంగళూరు, పుణె వంటి నగరాలను వెనక్కి నెట్టి మరీ,ఈ కేటగిరీలో హైదరాబాద్ అగ్రస్థానంలోకి వచ్చింది. 2022 ఏడాదిలో పెద్ద ఆఫీసు స్థలాలకు హైదరాబాద్‌లో భారీగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా 1,00,000 చదరపు అడుగులు, ఆపైన ఉన్న ఆఫీసులకు ఎక్కువ గిరాకీ ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా ఓ నివేదిక వెల్లడించింది. దేశంలోని ఇతర నగరాలు కరోనా కారణంగా ఆర్థికంగా వెనకడుగు వేస్తే తమ వ్యాపారాలను విస్తరించుకోవాలని భావిస్తున్న కంపెనీలకు భాగ్యనగరం ఒక మంచి అవకాశం, ఆశాకిరణంగా మారిందని పేర్కొంది.
వ్యూహాత్మకమైన ప్రాంతాలు, భారీ మౌలిక సదుపాయాలు, నైపుణ్యవంతులైన సిబ్బంది లభించడం వంటివి భాగ్యనగరం వైపు కంపెనీలు చూసే విధంగా చేస్తున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఆవిష్కరణలు, టెక్నాలజీ పరంగా హైదరాబాద్‌కు ఉన్న పేరు, ప్రతిష్ఠల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద ఐటీ కంపెనీలను ఆకర్షించడానికి కారణమని వెల్లడించింది. అందుకే, ప్రముఖ కంపెనీలు హైదరాబాద్‌లో తమ బ్రాంచ్‌లను ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపుతున్నాయని పేర్కొంది. దీంతో హైఎండ్ ఆఫీస్ స్థలాలకు డిమాండ్ పెరుగుతున్నట్లు నివేదిక తెలిపింది.
హైదరాబాద్‌లో పెద్ద, చిన్న ఆఫీసు స్థలాలకు బ్యాలెన్స్ చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. 50 వేల చదరపు అడుగుల కన్నా తక్కువ స్థలం ఉన్న ఆఫీసులు 25 శాతం మేర ట్రాన్సాక్షన్లు జరిగినట్లు తెలిపింది. అలాగే 50 వేల నుంచి లక్ష చదరపు అడుగుల స్పేస్ ఉన్న ఆఫీసులు 22 శాతం లావాదేవీలు జరిగాయి. ఈ నేపథ్యంలో చిన్న, పెద్ద అన్ని రకాల కంపెనీలు తమ ఆఫీసులను తెరిచేందుకు వీలు పడుతోందని నివేదిక తెలిపింది. రానున్న రోజుల్లోనూ కమెర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కీలకంగా హైదరాబాద్ మారనుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.