‘మొదటి ప్రయత్నంలో సివిల్స్ సాధించడం ఎలా’ సెమినార్ లయోలా అకాడమీలో విజయవంతంగా సాగింది. 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ సహకారంతో లయోలా అకాడమీలో ఈ ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా, 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ పి. కృష్ణ ప్రదీప్ మాట్లాడుతూ, సమాజ సేవ కోసం అధికారాలను వినియోగించుకునే సివిల్ సర్వెంట్ పాత్రను వివరించారు. సివిల్ సర్వీసెస్ లక్ష్యాన్ని చేరుకోవడంలో నిబద్ధత, పట్టుదల, సేవా దృక్పథం ఎంతో కీలకమని నొక్కి చెప్పారు. రోడ్డు రవాణా సదుపాయం లేని గ్రామానికి వంతెన నిర్మించిన ఐఏఎస్ అధికారి రేవు ముత్యాల రాజు సేవా భావానికి ఉదాహరణగా పేర్కొన్నారు.
నేపథ్యం ఏదైనా సివిల్స్ కొట్టచ్చు
21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్-చీఫ్ మెంటర్ డాక్టర్ భవానీ శంకర్ మాట్లాడుతూ, యూపీఎస్సీ పరీక్ష విధానం గురించి వివరిస్తూ, సివిల్స్ విజయం ఐఐటీల్లో చదివిన విద్యార్థులకే పరిమితం కాకుండా, అన్ని విద్యా నేపథ్యాల నుండి వచ్చిన వారికి సాధ్యమే అని పేర్కొన్నారు. సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, మౌలిక కాన్సెప్ట్‌లపై పట్టు ఉంటే ఏ విద్యార్థి అయినా సివిల్స్‌లో రాణించగలరని చెప్పారు. ఈ సందర్భంగా, 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ బృందం రచించిన సివిల్ సర్వీసెస్ పుస్తకాలను లయోలా అకాడమీ ప్రిన్సిపాల్ ఫాదర్ డాక్టర్ ఎన్ బీ బాబు ఎస్ జే ఆవిష్కరించారు.
సదస్సులో విద్యార్థి వ్యవహారాల డీన్ సరశ్చంద్ర, డాక్టర్ పి. సాయి మమత (విద్యార్థి వ్యవహారాల సమన్వయకర్త), భారతి (అసిస్టెంట్ ప్రొఫెసర్, మాస్ మీడియా) తో పాటు అధ్యాపకులు డాక్టర్ భవానీ, డాక్టర్ షఫీక్ అహ్మద్ పాల్గొన్నారు. వింగ్స్ మీడియా మరియు జి5 మీడియా తరఫున గిరి ప్రకాష్, గణేష్ హాజరయ్యారు.