మహిళా సాధికారత కోసం తమ దార్శనికతను మరింత బలోపేతం చేస్తూ 3,900 మంది బాలికలకు స్కాలర్షిప్స్ ప్రకటించింది ప్రముఖ నగల సంస్థ మలబార్ గ్రూప్. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మాతృ సంస్థ మలబార్ గ్రూప్ హైదరాబాద్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలికల విద్యకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.
21,000 మంది బాలికల విద్యకు మద్దతుగా
ఈ ఏడాది దేశవ్యాప్తంగా 21,000 మంది బాలికల విద్యకు మద్దతుగా 16 కోట్లను కేటాయించినట్టు సంస్థ వెల్లడించింది. తెలంగాణలోని 116 కాలేజీల్లో చదువుతున్న 3,900 మంది బాలికలకు ఈ స్కాలర్ షిప్ అందించేందుకు 3.14 కోట్లు కేటాయించింది. ఈ సందర్భంగా మలబార్ గ్రూప్ ఛైర్మన్ ఎంపీ అహ్మద్ మాట్లాడుతూ ఈ ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన సాధనం విద్యనే అన్నారు. సంస్థ లాభాల్లో 5 శాతంను పలు సేవాకార్యక్రమాలకు వినియోగిస్తున్నట్టు ఆయన తెలిపారు. 1999 లో ప్రారంభించిన మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పేదరిక నిర్మూలకు వినియోగిస్తున్నట్టు అహ్మద్ వివరించారు.
అతిథిగా మంత్రి సీతక్క
మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సీతక్క, విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్కులను అందజేశారు. అన్ని ఆటంకాలను అధిగమించి రాణించాలని విద్యార్థులకు హితబోధ చేసిన మంత్రి సీతక్క. అన్ని కష్టాలను తట్టుకొని ముందడుగు వేస్తేనే విజయం వరిస్తుందని, ఆర్థిక ఇబ్బందులతో ఎవరి చదువు ఆగకూడదన్నారు. అందుకే మలబార్ ట్రస్ట్ పేద విద్యార్థులకు ఆర్థిక సహకారం అందజేస్తుందని, మలబార్ ఫౌండేషన్కు అభినందనలు తెలిపారు.
మంత్రిగా ఉండి ఎల్ఎల్ఎం పూర్తి చేశా
చదువుతో పాటు విద్యార్థులకు సంస్కారం గౌరవ మర్యాదలు అవసరమని, ఉన్నత స్థానాలకు చేరుకున్న తోటి వారిని గౌరవించడం మర్చిపోవద్దన్నారు. తాను కూడా ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకొని ఈ స్టేజికి చేరుకున్నట్టు ఆమె విద్యార్థులకు వివరించారు. చిన్నతనంలోనే బడికి దూరమైనా ఇప్పుడు చదువుకు దూరంగా లేనని మంత్రి సగర్వంగా వివరించారు. మంత్రిగా ఉండి కూడా ఎల్ఎల్ఎం పూర్తి చేసినట్టు, ఆకలి లేని సమాజం కోసం తనవంతు కృషి చేస్తున్నట్టు ఆమె వివరించారు. కరోనా సమయంలో ప్రజల ఆకలి తీర్చేందుకు గో హంగర్ గో అనే కార్యక్రమాన్ని నిర్వహించినట్టు, సమాజాన్ని మార్చడంలో చదువు ఓ పదునైన ఆయుధమన్నారు.