ఎన్నో ఏళ్లుగా ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యేందుకు ట్రై చేస్తున్న టెస్లా కంపెనీ ఎట్టకేలకు మనదేశంలో అడుగుపెట్టనుంది. దీంతో టెస్లా తన తొలి స్టోర్స్ ఎక్కడ ప్రారంభిస్తుందనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతానికి ఢిల్లీ, ముంబైల్లో ఫ్లాగ్షిప్ షోరూమ్స్ ప్రారంభిస్తున్నట్టు టెస్లా ప్రకటించింది.
ఇక్కడే ప్రొడక్షన్ కూడా కానీ
ముంబైలోని ఎయిర్ పోర్ట్ సమీపంలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో, ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని ఎయిరో సిటీలో ఈ షోరూములు రెడీ అవుతున్నాయి. విశాలమైన 5000 స్క్వయర్ ఫీట్ భవనాల్లో ఈ షోరూములు వినియోగదారులను ఆకట్టుకునేలా ఉండనున్నాయి. ప్రస్తుతానికి టెస్లా కార్లను అమెరికా నుంచి దిగుమతి చేసుకుని ఈ షోరూముల ద్వారా కేవలం అమ్మకాలు మాత్రమే జరపాలని టెస్లా నిర్ణయించింది. కాగా కార్ సర్వీసుల సేవలను రెండవ దశలో భాగంగా అందుబాటులోకి తేనున్నారు. ఇక చివరి దశ అయిన మూడవ దశలో టెస్లా కార్లను మనదేశంలోనే ఉత్పత్తి చేసి, విక్రయించే చర్యలపై సంస్థ కసరత్తు తుది దశకు చేరుకుంటోంది. టెస్లా మనదేశానికి రావటంతో ఆ కంపెనీకి మార్కెట్ పెరగటంతో పాటు మనదేశంలోనూ ఉపాధి కల్పనకు రెడ్ కార్పెట్ వేసినట్టు అవుతుందని, ఆటోమొబైల్ రంగంలో మనదేశం దూసుకుపోతుండటమే దీనికి కారణమని మార్కెట్ విశ్లేషిస్తోంది.

అమెరికన్ కార్ల మార్కెట్లో టెస్లా కార్లకున్న క్రేజ్, డిమాండ్ నెక్ట్స్ లెవెల్ అన్నట్టు ఉంటుంది. దీంతో ఎప్పటినుంచో భారతీయలు కూడా టెస్లా కారు సొంతం చేసుకోవాలనే కలలు కంటూ ఉండేవారు. కానీ మన దేశంలో అమలులో ఉన్న ఎలక్ట్రిక్ వాహన నియమ నిబంధనలను కాదని ప్రత్యేక డిస్కౌంట్ కోరిన టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ తనకు రాయితీ ఇవ్వని కారణంగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టలేక పోయారు. కానీ తాజాగా జరిగిన మోడీ-ట్రంప్ భేటీ తరువాత టెస్లాకు మార్గం సుగమం అయింది.