Trans gender photo journalist inspiring story: కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. టాలెంట్‌కు కులం, మతం, ప్రాంతం, లింగం వంటివి అడ్డు రావని చాలా మంది చాటి చెప్పారు. సరిగ్గా అటువంటి స్పూర్తి వంతమైన ఓ కథే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. రైళ్లలో భిక్షాటన చేస్తూ జీవనం సాగించిన జోయా థామస్ అనే ఓ ట్రాన్స్‌జెండర్ ఫోటో జర్నలిస్టుగా మారి అందరినీ అబ్బురపరుస్తోంది. ట్రాన్స్‌జండర్ల జీవితాలపై ఆమె చేసిన ఓ షార్ట్ ఫిల్మ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అసలు జోయా నేపథ్యం ఏంటి? ఆమె ఫోటో జర్నలిస్టుగా ఎలా మారారనే విషయాలను తెలుసుకుందాం.
జోయా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు..
జోయా పుట్టింది అబ్బాయిగా. అయితే, అంతర్గతంగా తనది అమ్మాయి మనసు. పదకొండేళ్లకే తను అందరి పిల్లల్లాంటిది కాదని గ్రహించింది. పద్ధెనిమిదేళ్లకు తను ట్రాన్స్ జండర్ అని గుర్తించింది. ఇంట్లో నుంచి బయటికొచ్చి ట్రైన్లలో కొన్ని ఏళ్ల పాటు బిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీసుకుంది. బిచ్చమెత్తిన చేతులతోనే కెమెరా పట్టి భారతదేశ తొలి ట్రాన్స్ జండర్ ఫోటోజర్నలిస్టుగా పేరుతెచ్చుకుంది. జోయా జీవితమంతా ఆటుపోటులే.. కానీ అది తనలోని జోయా ఫోటోగ్రఫీ కలను కరగిపోనివ్వలేదు. తన ఫోటోలతో కోవిడ్ పాండమిక్ లో వలసకార్మికుల బతుకు వ్యథలను ప్రపంచానికి చాటి మన తొలి ట్రాన్స్ జండర్ ఫోటోజర్నలిస్టుగా ప్రపంచం ముంగిట నిలిచింది. ఫ్రీలాన్స్ ఫోటోజర్నలిస్టుగా జోయా ప్రయాణం నిజంగా ఎందరినో అబ్బురపరుస్తుంది. కోవిడ్ వ్యాప్తితో 2020లో జనతా కర్ఫ్యూ విధించిన సందర్భంలో బాంద్రా స్టేషన్ ముందు బాధాతప్త హ్రుదయాలతో, మోములతో నిలబడి నిరసన ప్రదర్శనలను చేస్తున్న వలస కార్మికులను తన కెమెరాలో జోయా బంధించింది.
ట్రాన్స్ జండర్ల జీవితంపై షార్ట్‌ఫిల్మ్..
ఆమె తీసిన ఫోటోలు జాతీయ, అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌గా మారాయి. ఆ క్షణం నుంచి ఆమె జీవితమే మారిపోయింది. అంతేకాదు, ట్రాన్స్ జండర్ల జీవితాలపై ఆమె ఒక లఘు చిత్రం జోయా జీవితాన్ని మలుపు తిప్పింది. ‘హిజ్రా షాప్ కి వర్తాన్ పార్ట్ 1 అనే లఘుచిత్రాన్నిజోయా యూట్యూబ్ లో చూసి దీనిలోని కొన్ని లోపాలను గుర్తించింది. వాటిని ఆ చిత్రం కామెంట్ సెక్షన్ లో పేర్కొంది. దాన్ని చదివిన ఆ చిత్ర డైరక్టర్ జోయాను సంప్రదించారు. అలా ఆ లఘు చిత్రానికి నిర్మించిన మరో సీక్వెల్ కు జోయా పనిచేసే అవకాశం వచ్చింది. ఆ చిత్రానికి మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆ చిత్రంలో జోయా పనితనానికి అవార్డు కూడా వచ్చింది. ఆ అవార్డు ప్రదానోత్సవంలో మహారాష్ట్ర డైలీ యజమాని శ్రీనిధి సింగ్ ను కలిసింది. అప్పుడు జోయాకు తన పేపరులో రిపోర్టరుగా ఆయన అవకాశం ఇచ్చారు. అలా జోయా దేశ తొలి ట్రాన్స్ ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా రికార్డు సృష్టిచారు. రిపోర్టర్ జాబ్ చేస్తూనే రైళ్లలో జోయా భిక్షాటన చేసేది. అలా కూడబెట్టిన డబ్బులతో 2019లో ముంబయి బోరాబజార్ లో సెకెండ్ హ్యాండ్ కెమెరా కొనుక్కుంది. ఆ సంవత్సరం జరిగిన పింక్ ర్యాలీ ఫోటోలను తీసింది. జోయా తీసిన ఆ ఫోటోలు పలు జాతీయ, అంతర్జాతీయ పబ్లికేషన్లలో ప్రచురితమయ్యాయి. అలా తొలిసారి ప్రపంచానికి జోయా పేరు ఫోటో జర్నలిస్టుగా తెలిసింది. ఇలా ఒక ట్రాన్స్‌జండర్ తన జీవితాన్ని గొప్పగా మలుచుకోవడంతో జోయాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.


