App : దేశీయ ఉత్పత్తులకు ఊతమివ్వాలన్న ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో, చెన్నైకి చెందిన జోహో కార్పొరేషన్ (Zoho Corporation) అభివృద్ధి చేసిన ‘అరట్టై’ (Arattai) యాప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. అరట్టై అంటే తమిళంలో “మాట్లాడటం” అని అర్థం.ఈ యాప్ ఇప్పటికే ఆపిల్ యాప్ స్టోర్‌లో సోషల్ నెట్‌వర్కింగ్ విభాగంలో నెం.1 స్థానంలో నిలిచి, టెక్ దిగ్గజాలను ఆశ్చర్యపరిచింది.
కేంద్ర మంత్రుల మద్దతు
స్థానిక ఉత్పత్తి అయిన అరట్టైకు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్ (విద్యాశాఖ మంత్రి), అశ్వినీ వైష్ణవ్ (రైల్వే, కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రి)ల నుంచి బలమైన ప్రోత్సాహం లభిస్తోంది.కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అయితే, తాను మైక్రోసాఫ్ట్ పవర్‌పాయింట్‌కు బదులుగా జోహో (Zoho) ప్లాట్‌ఫామ్‌కు మారుతున్నట్లు ప్రకటించారు. తాజా కేబినెట్ ప్రజెంటేషన్‌ను కూడా జోహో సాఫ్ట్‌వేర్‌తోనే తయారు చేసినట్లు వెల్లడించారు. ఇదే తరహాలో ధర్మేంద్ర ప్రదాన్ కూడా ‘అరట్టై’ను ప్రజలు వినియోగించాలని సూచించారు.
‘అరట్టై’లోని ప్రధాన ఫీచర్లు
అరట్టై యాప్‌ను వ్యక్తిగత, వృత్తిపరమైన అవసరాలకు తగిన విధంగా రూపొందించారు. ఇందులో టెక్స్ట్ మెసేజ్‌లు, వాయిస్/ వీడియో కాల్స్, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు పంపడం, స్టోరీస్, ఛానెల్స్ క్రియేట్ చేయడం వంటి అన్ని ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
గోప్యతపై ప్రశ్నలు, సవాలు
‘అరట్టై’ దేశీయ యాప్‌గా బాగా ఆదరణ పొందుతున్నప్పటికీ, గోప్యత (Privacy) విషయంలో ఓ పెద్ద లోటు ఉంది. ప్రస్తుతం ఈ యాప్‌లో కాల్స్‌కు మాత్రమే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంది. మెసేజ్‌లకు ఈ సౌకర్యం లేకపోవడం, ఆ డేటాను థర్డ్ పార్టీ వ్యక్తులు కూడా చూడగలగడం ఆందోళన కలిగిస్తోంది.
వాట్సాప్ లాంటి గ్లోబల్ దిగ్గజానికి గట్టి పోటీ ఇవ్వాలంటే, మెసేజింగ్‌కు కూడా కచ్చితంగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సౌకర్యాన్ని జోడించాలని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిరంతరం అప్‌డేట్‌లు, భద్రతా ఫీచర్లతో మెరుగుపరుచుకుంటే ‘అరట్టై’ త్వరలో వాట్సాప్‌కు బలమైన దేశీయ ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది.


