8th Pay Commission Update: 8వ కేంద్ర వేతన సంఘం (CPC)అమల్లోకి వస్తే, ఆర్థిక వ్యయం గత కమిషన్లతో పోలిస్తే జీడీపీలో దాదాపు 0.6–0.8%గా ఉంటుందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా వేసింది. దీని వల్ల 2.4 -3.2 లక్షల కోట్ల రూపాయలు అదనపు వ్యయం అవుతుందని పేర్కొంది.
కనీస వేతన స్థాయి నెలకు రూ.18,000 నుండి రూ.30,000 వరకు పెరగవచ్చని అంచనా వేసింది. అంటే దాదాపు 1.8 శాతం ఫిట్‌మెంట్ పెరిగినట్లే. ఇదే కనుక అమలైతే వేతనాల్లో 13 శాతం పెరుగుదల ఉండే అవకాశం ఉంది. దీంతో ఏడో వేతన కమిషన్ మాదిరిగానే దాదాపు 3.3 మిలియన్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యక్షంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో దాదాపు 90% మంది ఉన్న గ్రేడ్-సి సిబ్బంది ఎక్కువగా లాభపడే అవకాశం ఉంది.
ఏడాదిన్నర పట్టే అవకాశం
ఒక వేళ ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు చేసిన దాని సిఫార్సులు వచ్చే ఏడాది చివర్లో కానీ లేదా 2027 ప్రారంభంలో కానీ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇంకా నిబంధనలు ఖరారు చేస్తోందని.. కమిషన్ సభ్యులను నియమించాల్సి ఉందని బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది. గత పే కమిషన్లను పరిశీలిస్తే.. కమిషన్ ఏర్పడిన తర్వాత వారి నివేదికలను సమర్పించడానికి దాదాపు ఏడాదిన్నర పట్టింది. అయితే క్యాబినెట్ ఆమోదం తర్వాత అమలుకు మరో 3–9 నెలలు పట్టింది.
త్వరలోనే నిర్ణయం
ఎనిమిదో పే కమిషన్ విషయంలో మోదీ సర్కార్ త్వరలోనే నిర్ణయం తీసుకుబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోగా 8వ పే కమిషన్ చైర్మన్, ఇతర సభ్యుల నియామకం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి ఏడు నెలలు కావస్తున్న ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ లేదు. దీని విషయంలో కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది.


