8th pay commission News: 8వ వేతన సంఘం అమలు కోసం లక్షలాదిమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త వేతన సంఘం సిఫార్సులతో దాదాపు కోటి మందికిపైగా లబ్ధి చేకూరనుంది. అయితే ఈ కమిషన్ చైర్మన్, సభ్యులు, నిబంధనలను ఇంకా ఖరారు చేయలేదు.

అయితే 8వ వేతన సంఘం అమలు నేపథ్యంలో ఉద్యోగులు,పెన్షనర్లు ఒక ప్రధాన డిమాండ్‌ను లేవనెత్తుతున్నారు.పెరుగుతున్న వైద్య, ద్రవ్యోల్బణ ఖర్చులకు అనుగుణంగా కమ్యూటెడ్ పెన్షన్‌ను 15 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలకు తగ్గిస్తుందని ఆశిస్తున్నారు.

ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించే నేషనల్ కౌన్సిల్(JCM) – స్టాఫ్ సైడ్, కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ల జాబితాను పంపింది. ఇందులో 12 సంవత్సరాల కమ్యూటెడ్ పెన్షన్ డిమాండ్ ఒకటి.

కమ్యూటెడ్ పెన్షన్ అంటే.. పదవీ విరమణ సమయంలో, ఉద్యోగులు తమ నెలవారీ పెన్షన్‌లో కొంత భాగాన్ని ఒకేసారి తీసుకునే వెసులుబాటును కలిగి ఉంటారు. ఆ మొత్తాన్ని తిరిగి పొందడానికి ప్రభుత్వం ప్రతి నెలా వారి పెన్షన్ నుండి ఆ భాగాన్ని తీసివేస్తుంది. దీనిని కమ్యుటేషన్ అంటారు.

ప్రస్తుతం ఆ మినహాయింపు 15 సంవత్సరాలు ఉంది. ఆ తర్వాతే పూర్తి పెన్షన్ పునరుద్ధరించబడుతుంది. అందుకే ఆ మినహాయింపును 12 సంవత్సరాలకు తగ్గించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.

పెరుగుతున్న వైద్య ఖర్చులు, జీవన వ్యయాల దృష్ట్యా 15 సంవత్సరాల వ్యవధి చాలా ఎక్కువ అని ఉద్యోగులు వాదిస్తున్నారు. అంతేకాకుండా వడ్డీ రేట్లు తగ్గడంతో, పదవీ విరమణ సమయంలో తమ పెన్షన్ డబ్బులో ఎక్కువ భాగాన్ని కోల్పోతున్నామని చెబుతున్నారు. 12 సంవత్సరాల వ్యవధి తీసుకొస్తే తమ పూర్తి పెన్షన్‌ను త్వరగా తిరిగి పొందగలుగుతామని వెల్లడిస్తున్నారు.


