Adani Group investment in Maharashtra : ధారవి మురికివాడ రూపురేఖలు మారనున్నాయా? నవీ ముంబై కొత్త ఆర్థిక కేంద్రంగా అవతరించనుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతోంది అదానీ గ్రూప్. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF) వేదికగా, మహారాష్ట్ర అభివృద్ధిలో తాము కీలక భాగస్వాములు కానున్నామని ప్రకటిస్తూ, ఏకంగా 66 బిలియన్ డాలర్ల (సుమారు రూ.5.5 లక్షల కోట్ల) మెగా పెట్టుబడుల ప్రణాళికను ఆవిష్కరించింది.
దావోస్‌లో జరుగుతున్న 56వ ప్రపంచ ఆర్థిక సదస్సులో, అదానీ గ్రూప్ తమ భవిష్యత్ ప్రణాళికలను ప్రపంచం ముందుంచింది. ఇందులో భాగంగా, మహారాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధిలో దీర్ఘకాలిక భాగస్వామిగా నిలుస్తామని, భారీ పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.
ఏయే రంగాల్లో పెట్టుబడులు : ఈ రూ.5.5 లక్షల కోట్ల పెట్టుబడులను, రాబోయే 7 నుంచి 10 ఏళ్లలో, అనేక కీలక రంగాల్లో పెట్టనున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ డైరెక్టర్ ప్రణవ్ అదానీ తెలిపారు.
ధారవి పునరాభివృద్ధి: ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారవిని, ఓ ఆధునిక, ఆర్థికంగా శక్తివంతమైన నగరంగా తీర్చిదిద్దడం.
నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA): ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన ఈ విమానాశ్రయాన్ని కేంద్రంగా చేసుకుని, చుట్టుపక్కల లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, వాణిజ్య సముదాయాలను అభివృద్ధి చేయడం.
క్లీన్ ఎనర్జీ: 8,700 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్-స్టోరేజ్ హైడ్రోపవర్ ప్రాజెక్టులు, 3,000 మెగావాట్ల సామర్థ్యంతో గ్రీన్ డేటా సెంటర్ పార్కులు.
అధునాతన తయారీ: సెమీకండక్టర్, డిస్‌ప్లే ఫ్యాబ్రికేషన్ యూనిట్ల ఏర్పాటు.
ఇతరాలు: కోల్ గ్యాసిఫికేషన్ సౌకర్యాలు, విమానాశ్రయానికి సమీపంలో ఇంటిగ్రేటెడ్ అరీనా డిస్ట్రిక్ట్.
ఈ భారీ పెట్టుబడులను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతించారు.
“అదానీ గ్రూప్ అయినా, మరెవరైనా, మహారాష్ట్రకు పెట్టుబడులు తీసుకువచ్చే వారిని మేం స్వాగతిస్తాం. పెట్టుబడులు లేకుండా మన యువతకు ఉద్యోగాలు రావు.”
– దేవేంద్ర ఫడ్నవీస్, ముఖ్యమంత్రి, మహారాష్ట్ర
ఈ పెట్టుబడులు, కేవలం ఆస్తుల సృష్టికే పరిమితం కాకుండా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, సుస్థిరమైన, సమీకృత పర్యావరణ వ్యవస్థలను (ecosystems) నిర్మించడంపై దృష్టి సారిస్తాయని అదానీ గ్రూప్ తెలిపింది. ఈ మెగా ప్రణాళిక, మహారాష్ట్ర ఆర్థిక, సామాజిక స్వరూపాన్ని సమూలంగా మార్చేయనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

