Airtel Discontinues Rs.249 Plan: టెలికాం రంగంలో మరో ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ టెలికాం కంపెనీ భారతి ఎయిర్ టెల్, తన తక్కువ ధరలో అందుబాటులో ఉన్న రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్ ని 2025 ఆగస్టు 20వ తేదీ నుండి అధికారికంగా రద్దు చేసింది.
- Advertisement -
గతంలో, ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు అపరిమిత వాయిస్ కాల్స్, 1జీబీ డైలీ డేటా, మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్ లను 24 రోజుల గడువుతో పొందేవారు. అయితే, ఇప్పుడు ఎయిర్టెల్ ఈ ప్లాన్‌ను తొలగించి, అధిక విలువ గల ప్లాన్లను ప్రమోట్ చేస్తుంది. నెలసరి వినియోగదారులకు ఈ ప్లాన్ చాలా మందికి అనుకూలంగా ఉండేది.
టెలికాం రంగంలో వస్తున్న మార్పులు, పోటీ సంస్థలు తీసుకుంటున్న నిర్ణయాలు, సగటు ఆదాయాన్ని (ARPU) పెంచాలనే వ్యూహంతో ఎయిర్ టెల్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. జియో ఇప్పటికే ఇదే తరహా ప్లాన్‌ను (రూ.249, 1జీబీ/రోజు) తొలగించింది. తక్కువ డేటా అవసరాలున్న వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ, కంపెనీలు ఇప్పుడు ఎక్కువ డేటా, ఎక్కువ వ్యాలిడిటీ ఉన్న ప్లాన్లపై దృష్టి పెడుతున్నాయి.
ఈ ప్లాన్ రద్దుతో చిన్న స్కీమ్ లపై ఆధారపడే వ్యక్తులకు ఆర్థిక భారం పడుతుంది. 1జీబీ, అంతకన్నా తక్కువ డేటా ఉపయోగించేవారు కూడా అధిక ధరలు చెల్లించి వేరే ప్లాన్ లను తీసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం రూ.249 ప్లాన్ కి ప్రత్యామ్నాయంగా ఎటువంటి ప్లాన్ ప్రకటించలేదు. ఎయిర్టెల్ థాంక్స్ ఆప్ లో రూ.299 ప్లాన్ అమలులో ఉంది. ఇందులో 28 రోజుల గడువుతో ప్రతిరోజూ 1.5జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు, అపరిమిత కాల్స్ పొందవచ్చు.
ఎయిర్టెల్ తీసుకున్న ఈ నిర్ణయం వలన నెలసరి వినియోగదారులకు అసౌకర్యం కలుగుతుంది. అయితే, టెలికాం రంగంలో మారుతున్న వ్యాపార ధోరణులు, మార్కెట్ ట్రెండ్‌ను అనుసరించటం అవసరమవుతుంది.


