Akash Ambani as Jio Managing Director: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ప్రముఖ డిజిటల్ సేవల సంస్థ జియోలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జియో సంస్థ ఎండీ (మేనేజింగ్ డైరెక్టర్)గా ముఖేష్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీ నియమితులయ్యారు. ఏప్రిల్ 9, 2026 నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చిందని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో స్పష్టంగా పేర్కొంది. ఈ నియామకం రాబోయే ఐదేళ్ల కాలం పాటు కొనసాగనుందని రిలయన్స్ స్పష్టం చేసింది. ఈ మేరకు మే 7న కంపెనీ సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో నూతన నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. కాగా, త్వరలోనే జియో పరిధిలోని అన్ని డిజటల్ ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు సిద్ధమవుతున్న వేళ.. ముఖేష్ అంబానీ తనయుడు ఆకాశ్ అంబానీని జియో ఎండీగా ఎన్నుకోవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. జియో ఇన్ఫోకామ్ మే నెలాఖరున లేదా జూన్‌లో ఐపీఓ రానుందని.. దీనికి సంబంధించి ముసాయిదా పత్రాలను జియో సెబీకి త్వరలోనే సమర్పించే ఛాన్స్ ఉంది. ఈ నియామకం ద్వారా ఆకాశ్ అంబానీ జియో సంస్థపై మరింత పట్టు సాధించనున్నారు.
జియోకి రూ. 30 వేల కోట్ల నికర లాభం..
కాగా, జియో ప్లాట్‌ఫామ్ టెలికాం విభాగమైన జియో ఇన్ఫోకామ్ బోర్డు మెంబర్‌గా ఆకాశ్ అంబానీ గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నారు. ఆయన బోర్డు మెంబర్‌గా 2014 అక్టోబర్ నుంచి కొనసాగుతున్నారు. మరోవైపు, 2022 జూన్‌లో ఆకాశ్ అంబానీ జియో ఇన్ఫోకామ్ బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన నేతృత్వంలో జియో పదేళ్ల క్రితమే అనగా 2016లోనే అద్భుతమైన సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంది. కేవలం ప్రారంభమైన 6 నెలల్లోనే 10 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లను చేరుకొని భారతీయ టెలికాం రంగాన్ని కుదిపేసింది. భారతీయ టెలికాం రంగం జియోకి ముందు.. జియో తర్వాత అన్నట్లుగా మారింది. ఈ క్రమంలోనే కంపెనీ భారీ లాభాలను ఆర్జిస్తూ వస్తోంది. జియో ఇన్ఫోకామ్ 2026 ఆర్థిక సంవత్సరానికి గానూ ఏకంగా రూ.30 వేల కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. రూ.1.46 లక్షల కోట్ల ఆదాయాన్ని చూసింది.

