Saturday, November 15, 2025
Homeబిజినెస్Amazon: అమెజాన్ లేఆఫ్స్.. హైదరాబాద్‌లో కుల, ప్రాంతీయ వివక్ష ఆరోపణలు

Amazon: అమెజాన్ లేఆఫ్స్.. హైదరాబాద్‌లో కుల, ప్రాంతీయ వివక్ష ఆరోపణలు

Layoffs : ప్రపంచ టెక్ దిగ్గజం అమెజాన్ చేపట్టిన భారీ లేఆఫ్‌లు హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో అలజడి సృష్టిస్తున్నాయి. వేల మంది సాఫ్ట్‌వేర్ నిపుణులకు ఆశ్రయం ఇచ్చిన కార్పొరేట్ కార్యాలయాలు ఇప్పుడు భయాందోళనలకు కేంద్రంగా మారాయి. జులైలో మొదలైన ఈ తొలగింపులు డిసెంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని, ఈ వార్త ఉద్యోగుల కుటుంబాలలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.ఒకప్పుడు ఉద్యోగ భద్రతకు ప్రతీకగా నిలిచిన అమెజాన్‌లో, దాదాపు 11,000 మంది సిబ్బందిని తొలగించడం, ఐటీ ఉద్యోగుల గుండెల్లో గుబులు రేపుతోంది.

- Advertisement -

సీనియర్ సిబ్బందితో సహా, అనేక విభాగాల ఉద్యోగులకు ముందస్తు హెచ్చరిక లేకుండా, కేవలం ఒక ఈమెయిల్ ద్వారా తొలగింపు నోటీసులు అందడం వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. దీనికి ప్రధాన కారణం, సాధారణ పనులను కృత్రిమ మేధస్సు (AI) ఆటోమేషన్ తీసుకోవడం. దీనివల్ల తక్కువ సిబ్బందితోనే ఎక్కువ పని చేయాల్సి వస్తోంది.

అమెజాన్ ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. హైదరాబాద్ కార్యాలయంలో భారీ స్థాయిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు నేపథ్యంలో, ఈ నిర్ణయాల వెనుక సంస్థాగతమైన వివక్ష దాగి ఉందంటూ ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. డెక్కన్ క్రానికల్ ప్రత్యేక కథనం వెలుగులోకి తెచ్చిన ఈ వాస్తవాలు, కార్పొరేట్ రంగంలో కష్టపడి పనిచేసే ప్రతి ఉద్యోగిని కలవరపెడుతున్నాయి.ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు తమ ఆవేదనను వెల్లడిస్తూ, సంస్థలో పై స్థాయిలో ఉన్న కొందరు వ్యక్తులు ఈ తొలగింపుల ప్రక్రియను ప్రాంతీయ వివక్ష , కుల వివక్షకు అనుగుణంగా మార్చారని ఆరోపించారు.

సంస్థకు మెరుగైన సేవలు అందించి, అద్భుతమైన పనితీరు కనబరిచిన నిష్ణాతులైన ఉద్యోగులను కేవలం వేరే ప్రాంతానికి చెందిన వారనే ఏకైక కారణంగా తొలగించారు. కానీ, కనీస సబ్జెక్ట్ పరిజ్ఞానం లేకపోయినా, తమ ప్రాంతానికి లేదా వర్గానికి చెందిన వారనే సాకుతో కొందరిని ఉద్యోగాలలో కొనసాగించారు.అంటే, ఇక్కడ పనితీరు, నైపుణ్యం కంటే.. ప్రాంతం, కులం వంటి అంశాలే ఉద్యోగాన్ని నిర్ణయించే కీలక ప్రమాణాలుగా మారాయనేది వారి ఆరోపణల సారాంశం.మెరిట్ ఆధారంగానే తొలగింపులు జరుగుతున్నాయని కంపెనీలు చెబుతున్నప్పటికీ, నిష్ణాతులైన తమను తొలగించి, పనితీరు సరిగా లేని ఇతరులను కొనసాగించడం ఈ పనితీరు మదింపు (Performance Review) ప్రక్రియ యొక్క పారదర్శకతనే ప్రశ్నార్థకం చేస్తోంది.

ఈ ఆరోపణలు కేవలం ఉద్యోగం కోల్పోయిన బాధ మాత్రమే కాదు, అంతర్జాతీయ సంస్థ అయిన అమెజాన్ వంటి చోట్ల కూడా ప్రాంతీయత , కుల తత్వం వంటి అంశాలు చొచ్చుకు వస్తున్నాయనే భయాన్ని, నిరాశను కలిగిస్తున్నాయి. ఐటీ కారిడార్‌లో నెలకొన్న ఈ చీకటి కోణం, వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad