Layoffs : ప్రస్తుత టెక్ ప్రపంచాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , రోబోటిక్స్ టెక్నాలజీ శాసిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి పనిలో AI వినియోగం పెరుగుతుండటంతో, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగాలను AI భర్తీ చేసింది. ఈ క్రమంలో, టెక్ దిగ్గజం అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఉద్యోగుల విషయంలో సంస్థ తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై భారీ ప్రభావం చూపబోతున్నాయి. అమెజాన్ తన కార్మిక విభాగంలో మానవుల స్థానంలో భారీగా రోబోలను నియమించుకోవాలని యోచిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం, అమెజాన్ కేవలం అమెరికాలోనే 2033 నాటికి 6 లక్షల కంటే ఎక్కువ కార్మికుల ఉద్యోగాలను రోబోలతో భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఆటోమేషన్‌తో భారీ కోత:
అంతేకాదు, కంపెనీ కార్యకలాపాల్లో 75 శాతం ఉద్యోగాలను 2027 నాటికి పూర్తిగా ఆటోమేషన్ ద్వారానే నిర్వహించాలని అమెజాన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. గోదాములు, షిప్పింగ్ కేంద్రాలలో రోబోలను తీసుకురావడం ద్వారా, 2025 నుండి 2027 వరకు దాదాపు 12.6 బిలియన్ డాలర్లను ఆదా చేసుకోవచ్చని సంస్థ భావిస్తోంది.
ఇప్పటికే సంస్థలో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపులు (లేఆఫ్స్) జరిగిన నేపథ్యంలో, అమెజాన్ తీసుకున్న ఈ ‘రోబో’ నిర్ణయం భవిష్యత్తులో మరింత భారీ ఉద్యోగాల కోతకు దారితీస్తుందని టెక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులు నిర్వహించే పనుల్లో రోబోటిక్స్ సామర్థ్యం పెరగడంతో, మానవ వనరుల అవసరం వేగంగా తగ్గుతోంది.
ఒకవైపు టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నప్పటికీ, మరోవైపు లక్షలాది మంది కార్మికుల జీవితాలపై ఈ ఆటోమేషన్ యుగం ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుందోనని సర్వత్రా చర్చ జరుగుతోంది. అమెజాన్ నిర్ణయం రాబోయే దశాబ్దంలో కార్మిక మార్కెట్‌ను పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది.


