Silver Rates Prediction: 2025లో వెండి రేట్ల భవిష్యత్తు విషయంలో నిపుణులు రెండు విధాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కేజీ వెండి దీపావళి సమయంలో రూ. లక్షకు సమీపంగా ఉండగా.. ఈ ఏడాది రూ.2 లక్షలు క్రాస్ చేసిన తర్వాత మళ్లీ మూడు రోజుల నుంచి పతనం స్టార్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కనీవినీ ఎరుగని రేటుకు తాకిన ధరలు ధనత్రయోదశి రోజున భారీగా కుప్పకూలాయి. ఇవాళ ఒక్కరోజే రూ.13వేలు కేజీకి తగ్గగా.. నిన్న మెున్న కలిపి రూ.5వేలు తగ్గింది. ఈ పతనం ఇంకెంత వరకు అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి.
నిపుణుల అంచనాల ప్రకారం.. దీపావళి తరువాత కొంతకాలం వెండి రేట్లు తగ్గనున్నట్లు సూచిస్తున్నారు. దీపావళి తర్వాత కొనుగోలుదారుల తాకిడి తగ్గి ఒత్తిడి తగ్గుతుందని, డాలర్ బలపడటం, గ్లోబల్ వాణిజ్య యుద్ధాలు ఉపశమించడం వలన రేట్లు పతనమవుతుందని భావిస్తున్నారు. మెున్న గాజా పీస్ డీల్ చేసిన ట్రంప్ ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధం ఆపటంపై ఫోకస్ చేయటం ఇన్వెస్టర్లను వెండి, బంగారాన్ని పెట్టుబడి ప్రత్యామ్నాయంగా వాడటాన్ని తగ్గిస్తోందని నిపుణులు అంటున్నారు. కానీ పారిశ్రామిక డిమాండ్ మాత్రం పెరగటం గతంలో ఎన్నడూ లేని అరుదైన పరిస్థితిని కలిగించింది.
తక్కువ లిక్విడిటీ కలిగిన వెండి.. దీర్ఘకాలంలో ధరలు పెరుగుతూనే ఉంటాయని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 2027 నాటికి కేజీ వెండి ధర రూ.2,50,000కు చేరవచ్చని పేర్కొంటున్నారు. ఇది ప్రధానంగా పరిశ్రమల విస్తరణ, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఈవీ పరిశ్రమతో పాటు సెమీకండక్టర్ రంగాలపై డిమాండ్ ఆధారంగా రేట్లు ప్రభావితం అవుతాయని చెబుతున్నారు. ఒకవేళ పారిశ్రామిక వినియోగంలో సెమీకండక్టర్లు తగ్గిపోతే లేదా ప్రత్యామ్నాయ లోహాలు వాడినట్లయితే వెండి ధరలు కాస్త తగ్గటం ఖచ్చితమని తెలుస్తోంది.
హెడ్జింగ్ అవసరాలు, పారిశ్రామిక ఉపయోగాలు వెండి ధర పెరుగుదలకి ప్రాముఖ్యత కలిగిస్తాయి. పెట్టుబడిదారులు తక్కువ ధరల సమయంలో కొనుగోలు చేసి, దీర్ఘకాలానికి పెట్టుబడి పెట్టటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బై ఇన్ డిప్స్ అనే స్ట్రాటజీ వినియోగదారులు పాటించొచ్చని నిపుణులు అంటున్నారు. లేదా కేవలం పెట్టుబడి కోసం అనుకుంటే డిజిటల్ రూపంలో లేదా ఈటీఎఫ్స్ రూపంలో కూడా ఇన్వెస్ట్ చేయెుచ్చని ఇది భౌతికంగా డిమాండ్ తగ్గించి ధరల స్థిరీకరణకు తోడ్పడుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


