Indian Diesel To Ukraine: రష్యా నుంచి తక్కువ రేటుకు వస్తున్న చమురు దిగుమతులను ఇండియా ఆపాలంటూ నానా రాద్దాంతం చేస్తోంది అమెరికా. ఇదంతా దేనికిరా బాబు మా దేశం కోసం కావాల్సినవి మేం కొనుక్కుంటున్నాం అంటే అట్ల కుదరదు మీ వల్ల ఉక్రెయిన్ కి నష్టం జరుగుతోంది అంటూ వాధిస్తోంది అమెరికా. ఉక్రెయిన్ ప్రజల నష్టాలను మోదీ బలిగొంటున్నారంటూ అర్థం లేని వాదన చేస్తోంది. మరి మాకంటే ఎక్కువ ఆయిల్ కొంటున్న చైనా గురించి మాట్లాడరేంటి అనే భారత ప్రశ్నకు మాత్రం ట్రంప్ దగ్గర సమాధానం లేదు. అయితే అసలు రష్యా నుంచి ఇండియా కొంటున్న ఆయిల్ ఉక్రెయిన్ కి ఎంత ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
జూలై 2025 తాజా డేటా ప్రకారం ఉక్రెయిన్ కు అత్యధికంగా డీజిల్ సరఫరా చేస్తున్న దేశంగా ఇండియా నిలిచింది. రష్యా నుంచి తక్కువ రేటుకు చమురు కొని రిఫైన్ చేసి ఇండియా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే కానీ దీనివల్ల ఎక్కువ లబ్ధి ఉక్రెయిన్ కు జరుగుతోందని గణాంకాలు నిరూపిస్తున్నాయి. యుద్ధంలో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ భారత్ నుంచి తమ ఇంధన అవసరాల కోసం 15.5 శాతం డీజిల్ దిగుమతి చేసుకున్నట్లు జూలై డేటా చెబుతోంది. రోజూ ఉక్రెయిన్ కి 2700 టన్నుల డీజిల్ ఎగుమతి అవుతోంది భారత్ నుంచి.
ఈ ఏడాది జనవరిలో భారత్ ఉక్రెయిన్ చమురు అవసరాల్లో 10 శాతం తీర్చింది. వాస్తవానికి ఇది 2024 జూలైలో కేవలం 2 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. ఆంక్షలు ఉన్నప్పటికీ, రొమేనియా నుండి డానుబే వెంట ట్యాంకర్ డెలివరీల ద్వారా, అలాగే టర్కీలోని OPET టెర్మినల్ ద్వారా డీజిల్ ఉక్రెయిన్‌కు చేరుకుంటుందని వెల్లడైంది. జూలైలో ఉక్రెయిన్‌కు ప్రధాన ఇంధన సరఫరాదారులుగా స్లోవేకియా 15%, గ్రీస్ 13.5%, టర్కీ 12.4%, లిథువేనియా 11.4% నిలిచాయి.
అమెరికా గతంలో ఇరాన్, వెనుజువలాపై ఆంక్షలు విధించిన సమయంలో ఆ దేశాల నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు కట్టుబడి ఉన్న ఇండియా.. రష్యా విషయంలో మాత్రం చమురు కొనుగోళ్లు ఆపే ప్రసక్తే లేదని దృఢంగా ఉంది. అమెరికా మాస్కో చమురును లక్ష్యంగా చేసుకుంటుండగా.. ఇండియన్ ఆయిల్ రిఫైనరీలు నిశ్శబ్దంగా యూరప్ ఇంధన గొలుసులో కీలక పాత్ర పోషిస్తున్నాయి.


