Asian paints under cci investigation : భారత పెయింట్ పరిశ్రమలో దశాబ్దాలుగా అగ్రస్థానంలో ఉన్న ఏషియన్ పెయింట్స్ (Asian Paints) ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటోంది. కంపెనీ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందనే ఆరోపణలపై పోటీ నియంత్రణ సంస్థ అయిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) విచారణకు ఆదేశించింది. ఏషియన్ పెయింట్స్ పై అధికారిక విచారణ చేపట్టాలని సీసీఐ జూలై 1న ఆదేశించింది. ఈ చర్యకు ప్రధాన కారణం ప్రత్యర్థి కంపెనీ ఆదిత్య బిర్లా గ్రూప్ ఫిర్యాదు ఇవ్వడమే. బిర్లా గ్రూప్ కు చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ బిర్లా ఓపస్ పెయింట్స్ ఏసియన్ పెయింట్స్ పై సిసిఐకి ఫిర్యాదు చేసింది. 2024లో మార్కెట్లోకి వచ్చిన బిర్లా ఓపస్, తక్కువ సమయంలోనే మార్కెట్‌లో ప్రభావం చూపడంతో ఏషియన్ పెయింట్స్ తమ డీలర్లను తమతో మాత్రమే వ్యాపారం చేయాలని ఒత్తిడి పెడుతోందని ఆరోపించింది.
ఏం జరిగింది?
బిర్లా ఓపస్ దాఖలు చేసిన ఫిర్యాదులో ఏషియన్ పెయింట్స్ తన డీలర్లపై పలు ఆంక్షలు విధించి, కొత్త పోటీదారులను అడ్డుకుంటోందని తెలిపింది. ఈ ఆరోపణలను సీసీఐ పరిశీలించగా, ప్రాథమికంగా నిజమనే తేలింది.
సీసీఐ ప్రకారం, ఏషియన్ పెయింట్స్ తన అధిక మార్కెట్ వాటా (దాదాపు 53%)ను ఉపయోగించి పోటీదారులకు అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో అన్యాయ వ్యాపార పద్ధతులకు పాల్పడిందని అనుమానిస్తున్నారు.
ఆరోపణల ఇవే..
- ఏషియన్ పెయింట్స్ తమ డీలర్లను పోటీదారుల ఉత్పత్తులను విక్రయించవద్దని బెదిరించిందని ఆరోపణలు ఉన్నాయి. ఆ విధంగా చేస్తే క్రెడిట్ పరిమితులు తగ్గిస్తామని, డిస్కౌంట్లు రద్దు చేస్తామని చెప్పిందని బిర్లా ఓపస్ ఫిర్యాదులో పేర్కొంది.
- ఏసియన్ పెయింట్స్ తమ ఉత్పత్తులను మాత్రమే విక్రయించే డీలర్లకు విదేశీ పర్యటనలు, అదనపు రాయితీలు వంటి ప్రత్యేక ప్రయోజనాలు అందించిందని ఆరోపణలున్నాయి.
- ముడి పదార్థాల సరఫరాదారులు, రవాణాదారులు, భూ యజమానులపై కూడా ఒత్తిడి తెచ్చి, బిర్లా ఓపస్‌కు సహకరించవద్దని ఆదేశించిందని ఫిర్యాదులో ఉంది.
- ఈ చర్యలన్నీ కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించిన సంస్థలను స్థిరపడనివ్వక పోటీని తగ్గించే విధంగా ఉన్నాయని సీసీఐ అభిప్రాయపడింది.
సీసీఐ స్పందన
ఈ ఆరోపణల నేపథ్యంలో సీసీఐ తన డైరెక్టర్ జనరల్ (డిజి)కి 90 రోజుల లోగా పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఇది కేవలం ప్రాథమిక దర్యాప్తు మాత్రమే. తుది నిర్ణయం విచారణ అనంతరం తీసుకుంటారు. అంతేకాదు, విచారణ పూర్తయ్యాక, ఏషియన్ పెయింట్స్‌పై జరిమానా, లేదా వ్యాపార విధానాల్లో మార్పులు కూడా సీసీఐ సూచించే అవకాశం ఉంది.
పరిశ్రమపై ప్రభావం
భారత పెయింట్ రంగం ఇటీవల తీవ్రమైన పోటీకి వేదికవుతోంది. బిర్లా ఓపస్, జెఎస్డబ్ల్యు పెయింట్స్ లాంటి కొత్త బ్రాండ్లు ప్రవేశించడంతో పాత సంస్థలు తమ వ్యూహాలు మార్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకుముందు కూడా 2022లో JSW పెయింట్స్ కూడా ఇలాగే ఆరోపణలు చేస్తూ, సిసిఐకి ఫిర్యాదు కూడా ఇచ్చినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఆ సమయంలో ఏషియన్ పెయింట్స్ పై ఉల్లంఘనలుగా నిర్ధారణ కాకపోవడం దిగ్గజ సంస్థ ఆధిపత్యానికి తిరుగు లేకుండా పోయింది. కానీ ఈసారి సీసీఐ మరింత సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ఈ విచారణ భారత పెయింట్ రంగానికి మార్గదర్శిగా నిలిచే అవకాశం ఉంది. పెద్ద కంపెనీలు తమ ఆధిపత్యాన్ని ఉపయోగించి, పోటీదారులకు అడ్డంకులు సృష్టిస్తే ఎంత తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయో ఈ కేసు స్పష్టంగా సూచిస్తోంది.