August-Bank Holidays: చాలా మందికి నెలలో కనీసం ఒక్కసారైనా ఏదో పని మీద బ్యాంకుకి వెళ్తుంటారు.కానీ అలా అనుకోకుండా వెళ్లిన కొన్ని సందర్భాల్లో బ్యాంకు మూసి ఉండడం లేదా బ్యాంకు సెలవు అని రాసి ఉండడం చూస్తుంటాం. అలా బ్యాంకులకు హాలీడే ఎప్పుడో తెలుసుకోకుండా వెళ్తే..నిరాశ పడాల్సిందే. అలా డిస్పాయింట్ అవ్వకుండా ఉండాలి అంటే…ముందుగానే బ్యాంకులకు ఎప్పుడో సెలవులో తెలుసుకుని వెళ్లడం మంచిది.
15 రోజులు బ్యాంకుల సెలవులు…
ఆగస్టు 2025 నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు అనేక సెలవులు ఉండబోతున్నాయి. మొత్తం 15 రోజులు బ్యాంకులు మూసి ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సెలవుల జాబితా ఇక్కడ తెలుసుకుందాం.ఈ నెలలో ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు సహా పలు ప్రాంతీయ పండగల నేపథ్యంలో బ్యాంకులకు పని నిలిపివేయనున్నారు. ప్రత్యేకించి గణేష్ చతుర్థి, జన్మాష్టమి, రక్షాబంధన్, స్వాతంత్య్ర దినోత్సవం వంటి పండగలు రాబోవడంతో కొన్ని రోజులు వరుసగా సెలవులు ఉండబోతున్నాయి.
రాఖీ పండగ కూడా..
ఆగస్టు 3వ తేదీ ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు ఉంటుంది. అలాగే 9వ తేదీ రెండో శనివారం కావడంతో పాటు అదే రోజు రాఖీ పండగ కూడా జరగనుంది. ఈ రెండు కారణాల వల్ల బ్యాంకులు మూసి ఉంటాయి. తర్వాతి రోజు ఆదివారం కూడా సెలవే. 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.
జన్మాష్టమి..
16వ తేదీన జన్మాష్టమి పండగతో పాటు పార్సీ నూతన సంవత్సరం కూడా రావడంతో కొన్ని రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది. 17వ తేదీ మళ్లీ ఆదివారం కావడంతో ఆ రోజు బ్యాంకులు మూసే ఉంటాయి. అంతేకాకుండా 27వ తేదీన గణేష్ చతుర్థి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
గోవా, ఒడిశా రాష్ట్రాల్లో 28వ తేదీ నువాఖై పండుగ కారణంగా బ్యాంకులు పనిచేయవు. ఇక నెల చివరగా 31వ తేదీ మళ్లీ ఆదివారమే కాబట్టి ఆ రోజూ బ్యాంకులు మూసే ఉంటాయి. మొత్తంగా చూస్తే, ఆగస్టు నెల మొత్తం 31 రోజులలో 15 రోజులు బ్యాంకులు మూసి ఉండబోతున్నాయి.
కొన్ని సెలవులు…
అయితే ఈ సెలవులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వర్తించవు. కొన్ని సెలవులు ప్రాంతీయ పండగల ఆధారంగా ఉంటాయి కాబట్టి, ప్రతి రాష్ట్రంలోని బ్యాంకులు ఆ సెలవుల ప్రాతిపదికన పనిచేస్తాయి. ఉదాహరణకు, త్రిపురలో 19వ తేదీన మహారాజా బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జన్మదినం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. మణిపూర్‌లో 13వ తేదీ దేశభక్తి దివస్ జరుపుకుంటారు, ఆ రోజు అక్కడ బ్యాంకులు మూసే ఉంటాయి.
అసోంలో 25వ తేదీ శ్రీమంత శంకరదేవుని తిరుభావ తిథి సందర్భంలో బ్యాంకులు పనిచేయవు. ఇలా కొన్ని సెలవులు సంబంధిత రాష్ట్రాలకే పరిమితమవుతాయి. అందుకే ప్రతీ ఒక్కరూ తమ రాష్ట్రంలోని సెలవుల జాబితాను ప్రత్యేకంగా పరిశీలించుకోవడం మంచిది.
ఫిజికల్ బ్యాంకింగ్‌కు…
ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సెలవులు ఫిజికల్ బ్యాంకింగ్‌కు మాత్రమే వర్తిస్తాయి. ఆన్‌లైన్ సేవలు యధాతధంగా కొనసాగుతాయి. అంటే యాప్ ద్వారా బ్యాలెన్స్ చెకింగ్, యూపీఐ లావాదేవీలు, నెట్ బ్యాంకింగ్, ఫండ్ ట్రాన్స్ఫర్ వంటి అన్ని పనులు నిరవధికంగా కొనసాగుతాయి. ATMల నుంచే నగదు ఉపసంహరణ వంటి సేవలు కూడా అందుబాటులోనే ఉంటాయి.
ఇలాంటి సమయాల్లో ఆన్‌లైన్ లావాదేవీలను బాగా ఉపయోగించుకోవడం ద్వారా రోజువారీ అవసరాలపై ప్రభావం పడకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా పెద్ద నగరాల్లో ప్రజలు ఎక్కువగా డిజిటల్ బ్యాంకింగ్‌ను ఆశ్రయిస్తుండటంతో, సెలవుల సమయంలో పెద్దగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
Also Read: https://teluguprabha.net/business/post-office-ppf-scheme-earn-43-lakhs-with-daily-411-rupees/
అయితే పింఛన్లు, నిధుల డిపాజిట్లు, చెక్కుల క్లియరెన్స్ వంటి సేవలకు సంబంధించి బ్యాంకు బ్రాంచ్‌నే ఆశ్రయించాల్సి వచ్చే ప్రజలు, ఈ సెలవుల తేదీలను ముందుగానే తెలుసుకొని తమ పనులను ముందస్తుగా పూర్తి చేసుకోవాలి. అవసరమైతే బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తమ రాష్ట్రానికి సంబంధించిన సెలవుల వివరాలను తెలుసుకోవచ్చు.
మొత్తానికి ఆగస్టు నెలలో బ్యాంకు పనులు చేసుకోవాలనుకునే వారు జాగ్రత్తగా ఉండాలి. నెలలో సగం రోజులు బ్యాంకులు పనిచేయవని విషయం తెలుసుకొని, ముందుగానే తమ పనులను ప్లాన్ చేసుకోవాలి. తద్వారా అకస్మాత్తుగా బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా వ్యాపారులు, చిన్న పరిశ్రమల యజమానులు, పెన్షన్ దారులు, విద్యార్థులు తదితరులు ఈ విషయాన్ని గమనించాలి.


