Bank Nomination Rules 2025 : బ్యాంకింగ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. నవంబర్ 1, 2025 నుంచి డిపాజిట్ ఖాతాలు, సేఫ్టీ లాకర్లకు సంబంధించిన నామినేషన్ నిబంధనల్లో పెద్ద మార్పులు అమలవుతాయి. ఇకపై ఒకరికి మాత్రమే కాకుండా, గరిష్ఠంగా నలుగురు నామినీలను నియమించుకోవచ్చు. బ్యాంకింగ్ లాస్ (అమెండ్‌మెంట్) యాక్ట్ 2025లో భాగంగా ఈ మార్పులు తీసుకువచ్చారు. సెక్షన్లు 10, 11, 12, 13 నుంచి అమలు అవుతాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం దీని గురించి ప్రకటన విడుదల చేసింది.
ALSO READ: KTR: ‘బీఆర్ఎస్ అగ్రికల్చర్ తెస్తే.. కాంగ్రెస్ గన్ కల్చర్ తెచ్చింది’
కొత్త రూల్స్ ప్రకారం, డిపాజిట్ ఖాతాలకు నామినేషన్ రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి, సిమల్టానియస్ నామినేషన్ – నలుగురు నామినీలకు ఒకేసారి ప్రయోజనం అందేలా. రెండు, సక్సెసివ్ నామినేషన్ – ఒక నామినీ మరణించిన తర్వాత మరొకరికి ప్రయోజనం వెళ్లేలా. ఈ ఎంపికలు ఖాతాదారులే నిర్ణయించుకోవచ్చు. అయితే, సేఫ్టీ లాకర్లు, సేఫ్ కస్టడీ వస్తువులకు మాత్రం సక్సెసివ్ పద్ధతి మాత్రమే అనుమతి. ఇది భవిష్యత్తులో వారసులకు సమస్యలు తప్పించుతుంది.
మరో ముఖ్యమైన అంశం, నలుగురు నామినీలకు వాటా శాతాన్ని ముందుగానే నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు, మొదటి నామినీకి 40%, రెండవవాడికి 30% వంటివి. మొత్తం 100%కి సమానంగా ఉండాలి. ఇది క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను సులభం చేస్తుంది. ప్రభుత్వం లక్ష్యం, డిపాజిటర్ల ప్రయోజనాలు కాపాడటం, పారదర్శకత పెంచడం. ఇతర దేశాల్లో ఇలాంటి రూల్స్ ఇప్పటికే అమలులో ఉన్నాయి. భారత్‌లో ఇప్పుడు వచ్చిన మార్పు ఖాతాదారులకు పెద్ద ఊరట.
RBI త్వరలో ‘బ్యాంకింగ్ కంపెనీల (నామినేషన్) రూల్స్ 2025’ మరియు కొత్త ఫారమాలు విడుదల చేస్తుంది. అన్ని బ్యాంకుల్లో ఒకే విధంగా అమలు అవుతుంది. ఖాతాదారులు తమ బ్యాంకుల్లోకి వెళ్లి, ఇప్పటికే నామినేషన్ చేసుకున్నట్లయితే అప్‌డేట్ చేసుకోవాలి. ఇది ప్రత్యేకించి కుటుంబాల్లో ఆస్తి విభజనలో సమస్యలు ఉన్నవారికి మేలు. ఉదాహరణకు, ఒక కుటుంబంలో భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిని నామినీలుగా చేసి, వాటా శాతాలు నిర్ణయించుకోవచ్చు.
ఈ మార్పులతో బ్యాంకింగ్ సేవలు మరింత సులభమవుతాయి. ఖాతాదారులు ఇప్పుడే తమ ఖాతాలను చెక్ చేసి, అవసరమైతే మార్చుకోవాలి. ఆర్థిక శాఖ అధికారులు, ఈ రూల్స్ డిపాజిటర్ల భద్రతను మరింత పెంచుతాయని తెలిపారు.


