Best Interest Rates and Max Loan Amount with LAP: తక్షిణమే డబ్బు కావాలంటే లోన్ తప్ప వేరే మార్గం ఉండదు చాలా మందికి. ఇన్‌స్టంట్‌గా లోన్ వచ్చే అవకాశం ఉండటంతో పాటు తక్కువ వడ్డీకే లభిస్తుండటంతో ఈ లోన్లపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, ఎటువంటి తనఖా లేకుండా ఇచ్చే లోన్ల కంటే తనఖా పెట్టుకొని ఇచ్చే లోన్లలో వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. వీటినే ప్రాపర్టీ లోన్లుగా పిలుస్తారు. మీరు కూడా తక్కువ వడ్డీకి లోన్ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే, ఈ వివరాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
ప్రాపర్టీ లోన్లు ఎలా తీసుకోవాలి?
ఆస్తిని తాకట్టు పెట్టి తీసుకునే రుణాన్ని ప్రాపర్టీ లోన్ అంటారు. మీ పేరుపై ఉన్న ఏదైనా ఆస్తిని తనఖా పెట్టడం వల్ల దీన్ని పొందవచ్చు. ఈ రుణం మీరు తిరిగి చెల్లించే వరకు తాకట్టు పెట్టిన ఆస్తి బ్యాంకు లేదా బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థ (NBFC) ఆధీనంలో ఉంటుంది. మీరు 2025లో అలాంటి రుణాల కోసం చూస్తున్నట్లైతే.. తక్కువ వడ్డీ రేట్లు, త్వరగా రుణం పొందేందుకు మీరు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఆస్తిపై రుణం అనేది ఒక సెక్యూర్డ్ లోన్. దీనిలో మీరు మీ నివాస, వాణిజ్య లేదా పారిశ్రామిక ఆస్తిని బ్యాంకు లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC)కి తాకట్టు పెట్టవచ్చు. వ్యాపార విస్తరణ, ఉన్నత విద్య, వైద్య సంరక్షణ లేదా అనేక ఇతర అవసరాల కోసం మీరు ఈ రుణాన్ని పొందవచ్చు. మీరు పొందే రుణ మొత్తం ప్రధానంగా మీ ఆస్తి మార్కెట్ విలువ, మీ తిరిగి చెల్లించే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. మీ ఆస్తిని అమ్మకుండా పెద్ద మొత్తంలో డబ్బు పొందడానికి ఇది ఒక సరళమైన మార్గంగా చెప్పవచ్చు. దరఖాస్తుదారుడి క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా రుణ మొత్తం ఆస్తి మార్కెట్ విలువలో 85 శాతం వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది.
ఎవరెవరు లోన్ తీసుకోవచ్చు?
ఆస్తిపై రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీరు అవసరమైన అన్ని అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అయితే, ఈ అర్హత ప్రమాణాలు బ్యాంకు నుండి బ్యాంకుకు లేదా NBFCకి మారుతూ ఉంటాయి. ఆస్తిపై రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని అర్హతలు ఉంటాయి. ఆస్తి ఒప్పందాలపై ఉత్తమ రుణం పొందడానికి 750 లేదా అంతకంటే ఎక్కువ బలమైన క్రెడిట్ స్కోర్ ఉండేలా చూసుకోండి. దరఖాస్తు చేసుకునే ముందు మీ ప్రస్తుత అప్పులను చెల్లించండి, ఎందుకంటే ఇది అర్హత ప్రమాణాలను పెంచుతుంది. అత్యల్ప వడ్డీ రేటు పొందడానికి ఎల్లప్పుడూ వివిధ బ్యాంకులు, NBFCల నుండి ఆఫర్‌లను సరిపోల్చండి. అలాగే మీ ఆస్తి పత్రాలను అప్డేట్ చేసుకోండి. మొత్తం వడ్డీ రేటును తగ్గించడానికి తక్కువ రుణ వ్యవధిని ఎంచుకోండి.

