Muhurat Trading 2025: దీపావళి ముహురత్ ట్రేడింగ్ అంటే దీపావళి పండుగ సందర్భంగా భారతీయ స్టాక్ మార్కెట్లలో జరిగే ప్రత్యేక ట్రేడింగ్ సెషన్. ప్రతి సంవత్సరం దీపావళి రోజున మార్కెట్ మూసివుండగా.. కేవలం ఒక గంట పాటు ప్రత్యేకంగా ముహురత్ ట్రేడింగ్ మాత్రం నిర్వహిస్తారు. ఈ ట్రేడింగ్ సాంస్కృతిక దృష్టితో ఎంతో ప్రాముఖ్యం కలిగినది. ఇది పెట్టుబడిదారులకు శుభ సంకేతంగా భావించబడుతుంది.
2025 దీపావళి ముహురత్ ట్రేడింగ్ టైమింగ్‌లు మార్చబడ్డాయి. అక్టోబర్ 21 మధ్యాహ్నం 1:45 గంటల నుంచి 2:45 వరకు ఈ ప్రత్యేక ట్రేడింగ్ జరగనుంది. దీనికి ముందు 1:30 నుంచి 1:45 మధ్య ప్రీ ఓపెన్ సెషన్ ఉంటుంది. కార్తీక అమావాస్య కారణంగా ఈసారి ట్రేడింగ్ టైమ్స్ సాయంత్రం నుండి మధ్యాహ్న కాలానికి మారాయి. పండుగ రోజున మార్కెట్ మూసివుండగా కూడా ట్రేడర్లు అలాగే ఇన్వెస్టర్లు ఈ వేళలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కల్పించబడుతోంది.
ముహురత్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే ఆ ఏడాది వ్యాపారం సక్సెస్ అవుతుందని ట్రేడర్ల సెంటిమెంట్. దీని కారణంగా ఈ సెషన్‌లో మార్కెట్‌లో లావాదేవీలు ఎక్కువగ జరుగుతుంటాయి. ఈసారి NSE, BSE ఈ కొత్త టైమింగ్స్ ప్రకటించడం ద్వారా పెట్టుబడిదారులకు స్పష్టతనిచ్చింది. కాబట్టి దీపావళి పండుగ సందర్భంగా పెట్టుబడులకు ఈ ప్రత్యేక ట్రేడింగ్ వేదికను తప్పక వినియోగించుకోవడం మంచిది.
12 ఏళ్ల తర్వాత టైమింగ్స్ మార్పు ఎందుకు..
హిందూ పంచాంగ ప్రకారం కార్తీక అమావాస్య తిధి మధ్యాహ్నం సమయంలో అత్యంత శుభముహూర్తంగా ఉన్నందున, ఆధ్యాత్మికంగా అది పెట్టుబడులకు శ్రేయోభిలషకరంగా పరిగణించబడింది. అందువల్ల ఈసారి ట్రేడింగ్ సమయాన్ని తిధికి అనుగుణంగా మార్చారు. అలాగే విదేశీ పెట్టుబడిదారులు, అంతర్జాతీయ మార్కెట్ పాల్గొనేవారికి మరింత సౌలభ్యం కల్పించడానికి మధ్యాహ్న సమయాన్ని నిర్ణయించారు. ఈ సమయానికి గ్లోబల్ మార్కెట్లలో కూడా యాక్టివిటీలో ఉండటంతో, భారతీయ మార్కెట్‌లో వారి క్రియాశీలత పెరుగుతుంది. సాయంత్రం ట్రేడింగ్ జరిగితే దీపావళి వేడుకల సమయంలో చాలామంది ట్రేడర్లు పాల్గొనలేకపోయేవారు. మధ్యాహ్న ట్రేడింగ్‌తో మార్కెట్ సెటిల్‌మెంట్ మరింత సులభం అవ్వడం వంటి ఇతర కారణాలు కూడా దీని వెనుక ఉన్నాయి.


