Taxi App: భారతీయ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, కేంద్ర ప్రభుత్వం ‘భారత్ ట్యాక్సీ’ పేరుతో సరికొత్త సహకార ట్యాక్సీ సేవలను ప్రారంభించబోతోంది. ప్రస్తుతం టాక్సీ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓలా (Ola), ఊబర్ (Uber), రాపిడో (Rapido) వంటి అగ్రిగేటర్లకు ఇది భారీ షాక్‌గా మారనుంది. డ్రైవర్లు, వినియోగదారుల నుంచి ఎదురవుతున్న కమీషన్ల సమస్యలు, అధిక ధరలు మరియు క్యాన్సిలేషన్ ఆరోపణలకు చెక్ పెట్టడమే దీని ముఖ్య లక్ష్యం.
డ్రైవర్లకే లాభాలు, కమీషన్ రద్దు
కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ ‘సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్’ ద్వారా, డ్రైవర్లకు పూర్తి లాభాలు దక్కనున్నాయి. ఇప్పటికే ఉన్న కంపెనీల్లా 25 శాతం కమీషన్ చెల్లించాల్సిన అవసరం ఇందులో లేదు. డ్రైవర్లు కేవలం నామమాత్రపు ‘మెంబర్‌షిప్ ఫీజు’ చెల్లించి సేవలు అందించవచ్చు. టూ వీలర్లు, ఆటోలు, ఫోర్ వీలర్లు అన్నీ ఈ ప్లాట్‌ఫామ్‌లో భాగం కానున్నాయి.
ఢిల్లీలో పైలట్ ప్రాజెక్ట్, దేశమంతా విస్తరణ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో ప్రకటించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వచ్చే నెల నవంబర్ నుంచే ఢిల్లీలో పైలట్ ప్రాజెక్ట్‌గా మొదలు కానుంది. తొలి దశలో 650 మంది సొంత వాహనాలు కలిగిన డ్రైవర్ల సేవలను వినియోగించనున్నారు. రాజధాని నగరంలో ఈ మోడల్ విజయవంతమైతే, డిసెంబర్ నాటికి భారత్ ట్యాక్సీ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.
2026 మార్చి నాటికి మెట్రో నగరాల్లో, 2030 నాటికి లక్ష మంది డ్రైవర్లను ఈ ప్లాట్‌ఫామ్‌లో భాగం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ ట్యాక్సీ రాకతో రవాణా రంగంలో ధరలు, నాణ్యత విషయంలో ఆరోగ్యకరమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది. డ్రైవర్ల శ్రేయస్సు, మెరుగైన వినియోగదారుల సేవలే లక్ష్యంగా వస్తున్న ఈ సర్వీస్ దేశ ప్రజల ఆదరణను ఎంత మేరకు పొందుతుందో చూడాలి.


