BSNL Expansion: బీఎస్ఎన్ఎల్ త్వరలో 3–4 లక్షల కొత్త 4జీ టవర్ల కోసం టెండర్ విడుదల చేయబోతోంది. ముఖ్యంగా దేశీయ టెక్నాలజీ కంపెనీలకే ఈ టెండర్ పరిమితం కానుందని సమాచారం. టీసీఎస్ – సీ-డాట్ కన్సార్టియంతో ఇప్పటికే భారత్ అంతటా స్వదేశీ 4జీ నెట్‌వర్క్ ఏర్పాటుకు టీజాస్ నెట్‌వర్క్స్, లేఖా వైర్‌లెస్, గలోర్ నెట్‌వర్క్ వంటి సంస్థలు 5జీ టెండరులో ముందుకొచ్చాయి. 4జీ టవర్లు తరువాత 5జీకి అప్‌గ్రేడు అయ్యే విధంగా దేశీయ సాంకేతికతను వీటిలో ఉపయోగిస్తున్నారు.
ప్రభుత్వం ఇప్పటికే రూ.47,000 కోట్ల క్యాపెక్స్ ప్యాకేజీని బీఎస్ఎన్ఎల్ కోసం ప్రకటించింది. ఈ మెుత్తాన్ని టవర్ల సంఖ్యను పెంచడం, స్వదేశీ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ఆధారంగా విస్తరణ జరుగుతోంది. ఇప్పటివరకు ఒక లక్ష టవర్లు ఇన్ స్టాల్ కాగా.. మొత్తం లక్ష్యంగా జియో, ఎయిర్టెల్‌ల స్థాయిలో పోటీకి సిద్ధం అయ్యేలా కనీసం 3–4 లక్షల అదనపు టవర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ టెలికాం సంస్థ నిర్ణయించింది. ఈ పెట్టుబడులు అంతర్గత ఆదాయాలు, ఆస్తుల మోనిటైజేషన్, ప్రభుత్వ సహాయంతోనే జరుగుతాయని తేలింది.
85–90% టవర్లు సాఫీగా పని చేస్తున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ వెల్లడించారు. ఒకేసారి మూడు ప్రధాన కంపెనీలు మిగిలే విధంగా ప్రపంచ మార్కెట్లలో ధోరణి ఉంటుందని, అందులో భారత్‌లో జియో, ఎయిర్టెల్‌తో పాటు బీఎస్ఎన్ఎల్ సమర్ధవంతంగా మూడవ పాత్ర పోషిస్తుందని తెలిపారు. వోడాఫోన్ ఐడియా ఉన్నప్పటికీ ఆర్థికంగా బలహీన స్థితిలో ఉండగా.. ప్రభుత్వ ఆధీనంలో బీఎస్ఎన్ఎల్‌ను బలోపేతం చేయడం ప్రధాని మోడీ ప్రాధాన్యంగా తీసుకున్నారని చెప్పారు.
చౌక టారిఫ్‌లే ప్రత్యేకత..
జియో, ఎయిర్టెల్ ఎంట్రీ లెవెల్ ప్లాన్లను తొలగిస్తూ కనీస టారిఫ్‌లను పెంచిన నేపథ్యంలో.. బీఎస్ఎన్ఎల్ మాత్రం చౌకగా ప్లాన్లు ఇస్తూ అందరిలోకీ చేరాలనే వ్యూహాన్ని కొనసాగిస్తోంది. అవసరమనిపిస్తే ఇంకా తక్కువ ధరల టారిఫ్‌లు అందిస్తామని మంత్రి చెప్పారు. ఇలా ప్రైవేట్ కంపెనీలు ధరలు పెంచే సమయంలో బీఎస్ఎన్ఎల్‌కు కొత్త యూజర్లను ఆకర్షించుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
సిమ్ డోల్ డెలివరీ ప్రాజెక్ట్..
సిమ్ డెలివరీ సౌకర్యం కోసం ఇండియా పోస్టుతో పైలట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టింది బీఎస్ఎన్ఎల్. ఇంటికే సిమ్ డెలివరీతో పాటు, తమిళనాడులో పరీక్షిస్తున్న eSIM సేవ త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. అదనంగా ఫైబర్-టు-ది-హోమ్ (FTTH) కనెక్షన్లు పెంచడంపైనా దృష్టి సారించారు. కేబుల్ కట్స్ సమస్య తగ్గించేందుకు కొత్త నిబంధనల ప్రకారం నాలుగు గంటల్లో రిపేర్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రతి సర్కిల్‌కు 20–30% ఆదాయ వృద్ధి లక్ష్యాలు పెట్టారు. బీఎస్ఎన్ఎల్ సిబ్బందిని పనితీరు ఆధారంగా ఇన్సెంటివ్స్ ఇస్తూ.. మరింత సమర్ధత సాధించాలనే ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా, వైఫై హాట్‌స్పాట్స్ ద్వారా కాలింగ్ సర్వీసులు అందించే ప్రయోగం చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో ఫిజికల్ టవర్ల అవసరాన్ని తగ్గిస్తుందని తెలుస్తోంది. మెుత్తానికి బీఎస్ఎన్ఎల్ ప్రైవేటు ఆటగాళ్లతో పోటీలో ఏమాత్రం తగ్గేదే అన్నట్లుగా ముందుకు తీసుకెళ్లేందుకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు మోడీ సర్కార్ పూనుకుందని దీని ద్వారా తెలుస్తోంది.


