Peak Hours Cab Fares Hike: క్యాబ్ సేవలను పొందే ప్రయాణికులకు ఇప్పుడు రద్దీ సమయాల్లో చార్జీలు చూస్తే చుక్కలు కనిపించనున్నాయి. కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) మోటార్ వెహికల్స్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్‌ను సవరించింది. దీని ప్రకారం ఓలా, ఊబర్, రాపిడో వంటి క్యాబ్ అగ్రిగేటర్లు పీక్ అవర్స్‌లో బేస్ ఫేర్‌కు రెట్టింపు వరకు ఛార్జ్ చేయడానికి అనుమతించారు. ఇదివరకు ఉన్న 1.5 రెట్లు పరిమితిని పెంచుతూ తీసుకున్న ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది రద్దీ సమయాల్లో ధరల విషయంలో రైడ్-హెయిలింగ్ సేవలకు మరింత స్వేచ్ఛను ఇస్తుంది. అయితే ఇది రోజువారీ ప్రయాణికులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.
కొత్త నియమాలు
కొత్త నిబంధనల ప్రకారం, క్యాబ్ కంపెనీలు నాన్-పీక్ అవర్స్‌లో బేస్ ఫేర్‌లో కనీసం 50 శాతం ఛార్జ్ చేయవచ్చు. అదే పీక్ అవర్స్‌లో అయితే మాత్రం బేస్ ఫేర్‌కు రెట్టింపు వరకు ఛార్జ్ చేసే వెసులుబాటు కల్పించారు. వినియోగదారుల భద్రత, డ్రైవర్ల సంక్షేమం, వ్యాపార కార్యకలాపాల మధ్య సమతుల్యత సాధించడం ఈ కొత్త నిబంధనల ముఖ్య ఉద్దేశ్యంగా ఉంది.
“డెడ్ మైలేజ్” పరిష్కారం
బేస్ ఫేర్‌ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. వివిధ రకాల లేదా తరగతుల మోటారు వాహనాలకు నిర్దిష్ట మొత్తాలను రాష్ట్రాలు తెలియజేస్తాయి. ఈ కొత్త మార్గదర్శకాలను మూడు నెలల్లోగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ముఖ్యంగా, “డెడ్ మైలేజ్” సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక స్పష్టతనిచ్చింది. డ్రైవర్ ప్రయాణికుడి పికప్ పాయింట్‌కు చేరుకోవడానికి ప్రయాణించిన దూరం, అలాగే ఉపయోగించిన ఇంధనాన్ని “డెడ్ మైలేజ్”గా పరిగణిస్తారు. ఈ ఖర్చులను భర్తీ చేయడానికి బేస్ ఫేర్ కనీసం 3 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, మొత్తం రైడ్ దూరం 3 కిలోమీటర్ల కంటే తక్కువగా ఉంటే తప్ప, ప్రయాణికులకు డెడ్ మైలేజ్‌కు అదనంగా ఛార్జ్ చేయబడదు. అన్ని రైడ్‌లకు, పికప్ పాయింట్ నుండి డ్రాప్-ఆఫ్ పాయింట్ వరకు ఉన్న దూరం ఆధారంగా ఛార్జీలు లెక్కిస్తారు.
డ్రైవర్ సంక్షేమం
డ్రైవర్లకు సరసమైన చెల్లింపులకు ఈ మార్గదర్శకాల్లో ప్రాధాన్యతనిచ్చారు. తమ సొంత వాహనాలను కలిగి ఉండి, అగ్రిగేటర్‌లతో భాగస్వామ్యం చేసుకున్న డ్రైవర్లు వసూలు చేసిన మొత్తం ఫేర్‌లో కనీసం 80 శాతం పొందాలని నిర్ధారిస్తుంది. మిగిలిన మొత్తాన్ని అగ్రిగేటర్ ఉంచుకోవచ్చు. డ్రైవర్లకు చెల్లింపులను కంపెనీతో వారి ఒప్పందం ఆధారంగా రోజువారీ, వారానికో లేదా పక్షం రోజులకో చేయవచ్చు. అగ్రిగేటర్ యాజమాన్యంలోని వాహనాన్ని డ్రైవర్ నడుపుతున్న సందర్భాల్లో, డ్రైవర్‌కు వసూలు చేసిన ఫేర్‌లో కనీసం 60 శాతం లభించాలి, మిగిలిన మొత్తాన్ని అగ్రిగేటర్ ఉంచుకోవచ్చు. ఇది డ్రైవర్ల ఆదాయ భద్రతకు ఒక సానుకూల చర్యగా చెప్పవచ్చు.
రైడ్ క్యాన్సిల్ నియమాలు, జరిమానాలు
రైడ్ రద్దులకు సంబంధించి కూడా ప్రభుత్వం కొత్త నియమాలను రూపొందించింది. డ్రైవర్ ఒక రైడ్‌ను అంగీకరించిన తర్వాత సరైన కారణం లేకుండా రద్దు చేస్తే, ఫేర్‌లో 10 శాతం జరిమానాగా విధించబడుతుంది. గరిష్టంగా రూ.100. ఇదే నియమం ప్రయాణికులకు కూడా వర్తిస్తుంది. సరైన కారణం లేకుండా ప్రయాణికుడు రైడ్‌ను రద్దు చేస్తే, అదే మొత్తంలో జరిమానా వసూలు చేయబడుతుంది.
ఈ కొత్త మార్గదర్శకాలు భారతీయ క్యాబ్ అగ్రిగేటర్ల మార్కెట్‌లో గణనీయమైన మార్పులను తీసుకువస్తాయి. పీక్ అవర్స్‌లో రెట్టింపు ఛార్జీలు ప్రయాణికుల జేబులకు భారంగా మారవచ్చు, అయితే డ్రైవర్లకు మెరుగైన ఆదాయాన్ని అందించడం, “డెడ్ మైలేజ్” సమస్యను పరిష్కరించడం మరియు రద్దు విధానాలను క్రమబద్ధీకరించడం వంటి సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మార్గదర్శకాలను త్వరలో అమలు చేయాల్సి ఉంటుంది.