Capgemini acquires wns : ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ బిజినెస్, టెక్నాలజీ సంస్థ కాప్జెమినీ (Capgemini) మరియు బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ సేవల సంస్థ డబ్ల్యూఎన్‌ఎస్ (WNS) మధ్య భారీ విలీనం ఒప్పందం కుదిరింది. కాప్జెమినీ సంస్థ, అమెరికాలో లిస్టింగ్ అయిన డబ్ల్యూఎన్‌ఎస్ కంపెనీని $3.3 బిలియన్ డాలర్ల (రూ.27,500 కోట్లు) నగదు విలువకు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇది కేవలం ఆర్థిక పరంగా కాకుండా, వ్యూహాత్మక పరంగా కూడా పరిశ్రమలో గొప్ప మార్పునకు దారి తీయబోతోంది.
ఈ డీల్ ప్రకారం, ఒక్కో డబ్ల్యూఎన్‌ఎస్ షేరుకు $76.50 చెల్లించనున్నారు. ఇది గత 90 రోజుల గడిచిన సగటు షేర్ ధరతో పోలిస్తే 28% ప్రీమియం, 30 రోజుల సగటు ధరతో పోలిస్తే 27% ప్రీమియం, చివరి ట్రేడింగ్ రోజైన జూలై 3 షేర్ ధరతో పోలిస్తే 17% ఎక్కువగా ఉంటుంది. ఈ స్థాయి ప్రీమియంతో కొనుగోలు చేయడం ద్వారా కాప్జెమినీ సంస్థ డబ్ల్యూఎన్‌ఎస్ లో పెట్టుబడి చేస్తున్న విశ్వాసాన్ని స్పష్టం చేసింది.
కాప్జెమినీ ప్రకటన ప్రకారం, ఈ కొనుగోలు ఒప్పందం 2026 నాటికి కంపెనీకి 4% వరకు ఈపిఎస్ (EPS) పెరుగుదల కలిగిస్తుంది. ఇక 2027 నాటికి సమ్మిళిత ప్రయోజనాల ద్వారా ఈ పెరుగుదల 7% కు చేరనుంది. ఇది కంపెనీ ఆదాయంలో ప్రత్యక్ష లాభాలను చూపించే వ్యవహారంగా భావించబడుతోంది. మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఈ ఒప్పందాన్ని కాప్జెమినీ మరియు డబ్ల్యూఎన్‌ఎస్ ఇద్దరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. డీల్ 2025 చివరిలో పూర్తి కావాలని భావిస్తున్నారు.
కాప్జెమినీ CEO ఐమాన్ ఎజ్జాత్ మాట్లాడుతూ, Agentic AI ఆధారిత సేవల వైపు మార్పు జరుగుతోందని, ఈ నేపథ్యంలో డబ్ల్యూఎన్‌ఎస్ ను విలీనం కాప్జెమినీకి రంగాలపై అధిక పరిజ్ఞానం, ప్రామాణికత లభిస్తుందని తెలిపారు.
డబ్ల్యూఎన్‌ఎస్ సిఇఒ కేశవ్ ఆర్. మురుగేష్ మాట్లాడుతూ, ఇప్పటికే డిజిటలైజేషన్ పూర్తయిన అనేక సంస్థలు ఇప్పుడు AI ఆధారిత ఆటోనమీ సొల్యూషన్స్ వైపు దృష్టి పెడుతున్నాయి. ఈ డీల్ ద్వారా మా క్లయింట్లకు వ్యూహాత్మక విలువను అందించగల మేధోసారమైన సేవలను మరింత బలోపేతం చేయగలుగుతామన్నారు.
ఈ ఒప్పందంతో Capgemini బలోపేతం అవుతుంది. ఇంకా గ్లోబల్ స్థాయిలో తమ Intelligent Operations సేవలను పెంచుకుంటుంది. డబ్ల్యూఎన్‌ఎస్ ఇప్పటికే డిజిటల్ బిపిఎస్ (Digital BPS) రంగంలో సుస్థిర స్థానం సంపాదించుకుంది. రెండు కంపెనీల విలీనంతో, మెరుగైన డేటా ప్రాసెసింగ్, AI ఆధారిత ఆపరేషన్లు, క్లయింట్ అనుభవాన్ని మరింత సమర్థంగా నిర్వహించే అవకాశాలు ఏర్పడతాయి.
ఇక భారత ఐటి సేవల రంగంలో ఇది ఒక గొప్ప పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డబ్ల్యూఎన్‌ఎస్ ప్రధాన కార్యకలాపాలు ముంబయిలోనే ఉన్నాయి. ఈ ఒప్పందం వల్ల భారత టెక్ రంగానికి ప్రపంచ స్థాయిలో మరింత గుర్తింపు వచ్చే అవకాశముంది. ఉద్యోగుల పరంగా పెద్ద మార్పులు లేకపోవచ్చునన్న అంచనాలు ఉన్నాయి కానీ విలీనంతో కొన్ని నూతన అవకాశాలు కూడా తెరుచుకోవచ్చు.


