Cibil Score increase in One Month with Easy Tips: తక్కువ వడ్డీకే రుణాలు తీసుకోవాలన్నా, రుణాలకు అర్హత సాధించాలన్నా, క్రెడిట్ కార్డు తీసుకోవాలన్నా సిబిల్ స్కోర్ చాలా కీలకం. ఇది ఎంత బాగుంటే మీకు అంత తక్కువ వడ్డీ రేటుకే ఎక్కువ మొత్తంలో రుణాలు వస్తాయి. ప్రస్తుతం చాలా మంది సకాలంలో రుణాలు కట్టడం లేదు. దీంతో వారి సిబిల్ స్కోర్ ఒక్కసారిగా పడిపోతుంది. అలాంటి వారికి రుణాలు లభించడం కష్టతరంగా మారుతుంది. సిబిల్ స్కోర్‌ను కేవలం నెల రోజుల్లోనే సులభంగా పెంచుకోవాలి. ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం.
రుణాలు సరైన సమయంలో చెల్లించండి
సిబిల్ తగ్గడానికి ప్రధాన కారణం ఇదే రుణాలను సకాలంలో చెల్లించకపోవడం. క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎమ్‌ఐలు ఒక్క రోజు ఆలస్యం చేసినా కూడా క్రెడిట్ స్కోర్ మీద తీవ్రంగా ప్రభావం పడుతుంది. కాబట్టి మీరు కట్టాల్సిన సమయంలోనే పూర్తి ఈఎంఐ చెల్లించాలి. మీ క్రెడిట్, ఈఎంఐలకు తప్పకుండా ఆటోడెబిట్ సెట్ చేసుకోవాలి. దీనివల్ల సరైన సమయానికి ఈఎంఐ చెల్లిస్తారు. దీంతో మీ క్రెడిట్ స్కోర్ సులభంగా పెరుగుతుంది.
30% నియమాన్ని పాటించండి
ఈ రూల్ మీ సిబిల్ స్కోర్ పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. దీన్నే ‘క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో’ అంటారు. అంటే మీరు క్రెడిట్ కార్డు లిమిట్‌లో 30 శాతం కంటే తక్కువ మాత్రమే ఉపయోగించాలి. మీ క్రెడిట్ లిమిట్ మొత్తం వాడుకోవడం వల్ల సిబిల్ స్కోర్ పడిపోతుంది. ఉదాహరణకు మీ క్రెడిట్ పరిమితి లిమిట్ రూ.1 లక్ష అయితే మీరు రూ. 30 వేల కంటే ఎక్కువ వాడకుండా చూసుకోవాలి. మీరు ఎక్కువ ఖర్చు పెట్టినా, క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ రాకముందే కొంత డబ్బు చెల్లించి 30% కంటే తక్కువ బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి. దీంతో మీరు తక్కువగా డబ్బులు వాడుతున్నారని అర్థమవుతుంది. దీనివల్ల మీకు నెల రోజుల్లోనే సిబిల్ స్కోర్ పెరుగుతుంది.
కొత్త లోన్లు తీసుకోవద్దు
సిబిల్ పెరగాలని అనుకుంటే మాత్రం కొత్త లోన్ లేదా క్రెడిట్ కార్డు కోసం అసలు అప్లై చేయవద్దు. మీరు ఇలా చేయడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువగా డబ్బు అవసరం ఉందని బ్యాంకులు భావిస్తాయి. దీంతో ఆటోమెటిక్‌గా మీ సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. మీరు ఒక లోన్ తీసుకుంటే దాన్ని క్లియర్ చేసిన తర్వాత మాత్రమే ఇంకో లోన్ తీసుకోండి. అప్పుడే, మీ క్రెడిట్ స్కోరు పెరుగుతుంది. ఈ నియమాలను ఒకసారి పాటించి వదిలేయకుండా ఒక నెల నుంచి ఆరు నెలల పాటు పాటిస్తేనే సిబిల్ స్కోర్ ఈజీగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.


