Bharat Coking Coal IPO: భారత స్టాక్ మార్కెట్లో ప్రభుత్వ రంగ సంస్థల (PSU) హవా కొనసాగుతోంది. కోల్ ఇండియా అనుబంధ సంస్థ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (BCCL) ఐపీఓ ప్రారంభమైన తొలిరోజే ఇన్వెస్టర్ల నుంచి నీరాజనాలు అందుకుంది. శుక్రవారం సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమైన కేవలం కొన్ని నిమిషాల్లోనే ఈ ఇష్యూ పూర్తిగా అమ్ముడైపోవడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
హాట్ కేకుల్లా షేర్ల విక్రయం!
ఎన్‌ఎస్‌ఈ (NSE) గణాంకాల ప్రకారం.. ఉదయం 11:15 గంటలకే ఈ ఐపీఓ 2.43 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. 34 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా, ఏకంగా 84 కోట్ల షేర్లకు పైగా బిడ్లు దాఖలయ్యాయి. సామాన్య ఇన్వెస్టర్ల కోటా 3.35 రెట్లు సబ్‌స్క్రైబ్ అవ్వగా, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (NII) కోటా ఏకంగా 3.79 రెట్లు నమోదైంది. పబ్లిక్ ఇష్యూ కంటే ముందే దిగ్గజ సంస్థల నుంచి ఈ కంపెనీ రూ. 273 కోట్లు సమీకరించడం విశేషం.
Also Read:Jio IPO – రూ. 36 వేల కోట్లతో రిలయన్స్ జియో ఐపీఓ
ఎందుకీ డిమాండ్?
కేవలం రూ. 21 – రూ. 23 ధరల శ్రేణిలో షేర్లను ఆఫర్ చేయడం ఇన్వెస్టర్లను విపరీతంగా ఆకర్షించింది. తక్కువ ధరకే ప్రభుత్వ రంగ షేర్లు దొరుకుతుండటంతో అందరూ ఎగబడ్డారు. 1972లో ప్రారంభమైన BCCL, జారియా (జార్ఖండ్), రాణిగంజ్ (పశ్చిమ బెంగాల్) మైన్స్ నుంచి కోకింగ్ కోల్‌ను సరఫరా చేస్తోంది. ఉక్కు పరిశ్రమలో కోకింగ్ కోల్ అత్యంత కీలకం కావడంతో ఈ సంస్థ భవిష్యత్తుపై ఇన్వెస్టర్లు ధీమాగా ఉన్నారు.
కీలక తేదీలు
జనవరి 13న సబ్‌స్క్రిప్షన్ ముగుస్తుంది. జనవరి 16న బీఎస్‌ఈ (BSE), ఎన్‌ఎస్‌ఈలలో షేర్లు లిస్ట్ కానున్నాయి. ఈ ఐపీఓ ద్వారా ప్రభుత్వం రూ. 1,071 కోట్లు సమీకరించనుంది. ఇది పూర్తిగా ‘ఆఫర్ ఫర్ సేల్’ (OFS) పద్ధతిలో జరుగుతోంది.
కోల్ ఇండియా తన అనుబంధ సంస్థల విలువను అన్‌లాక్ (Value Unlocking) చేసే దిశగా వేసిన ఈ అడుగు అద్భుత విజయాన్ని అందుకుంది. బడ్జెట్ దగ్గర పడుతుండటం, మౌలిక సదుపాయాల రంగానికి ఊతం లభిస్తుండటంతో మైనింగ్ రంగ షేర్లకు డిమాండ్ పెరిగింది.

