Credit score improvement barriers : ప్రతినెలా క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎంఐలు ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా కడుతున్నారా? అయినా మీ క్రెడిట్ స్కోరు మాత్రం అంగుళం కూడా కదలడం లేదా? కొన్నిసార్లు పెరుగుతున్నట్లే పెరిగి మళ్లీ పడిపోతోందా? మీ ఆర్థిక క్రమశిక్షణకు గుర్తింపు ఎందుకు లభించడం లేదు? మీరు సక్రమంగానే ఉన్నా, స్కోరును తగ్గించేస్తున్న ఆ కనిపించని శత్రువులెవరు? తెలియకుండా మీరు చేస్తున్న ఆ పొరపాట్లేంటి? ఆ వివరాలు మీకోసం.
స్కోరు పెరగకపోవడానికి ఐదు ప్రధాన కారణాలు
1. వాడకంలో హద్దులు దాటుతున్నారా? (Credit Utilization Ratio – CUR) : మీ క్రెడిట్ స్కోరుపై అత్యంత ప్రభావం చూపే అంశం ఇదే. మీ క్రెడిట్ కార్డు లిమిట్ రూ.1 లక్ష అయితే, మీరు మీ వాడకాన్ని ఎప్పుడూ 30% లోపు, అంటే రూ.30,000 లోపే ఉండేలా చూసుకోవాలి. పరిమితికి దగ్గరగా లేదా పూర్తిగా వాడేస్తుంటే, మీరు అప్పులపై ఎక్కువగా ఆధారపడుతున్నారనే సంకేతాన్ని క్రెడిట్ బ్యూరోలకు పంపుతుంది. ఇది మీ స్కోరు పెరగకపోవడానికి ముఖ్య కారణం.
2. ఒకే రకం అప్పు.. స్కోరుకు తప్పు! (Credit Mix) : మీ పేరు మీద కేవలం క్రెడిట్ కార్డులు లేదా వ్యక్తిగత రుణాలు మాత్రమే ఉంటే స్కోరు నెమ్మదిగా పెరుగుతుంది. ఆర్థిక నిపుణుల ప్రకారం, మీ రుణాల్లో వైవిధ్యం (Credit Mix) ఉండాలి. అంటే, సురక్షిత (గృహ, వాహన రుణం) మరియు అసురక్షిత (క్రెడిట్ కార్డు, వ్యక్తిగత రుణం) రుణాల కలయిక ఉండాలి. ఇది మీరు వివిధ రకాల అప్పులను బాధ్యతాయుతంగా నిర్వహించగలరని సూచిస్తుంది. అయితే, వైవిధ్యం పేరుతో అవసరం లేని రుణాలు తీసుకోవడం మొదటికే మోసం తెస్తుంది.
3. తరచూ దరఖాస్తులు.. స్కోరుపై ప్రతికూలతలు (Hard Enquiries) : కొత్త క్రెడిట్ కార్డు ఆఫర్ బాగుందనో, లోన్ వస్తుందో లేదో తెలుసుకుందామనో స్వల్ప వ్యవధిలో అనేకసార్లు దరఖాస్తు చేస్తున్నారా? మీరు దరఖాస్తు చేసిన ప్రతీసారి, బ్యాంకులు మీ క్రెడిట్ రిపోర్టును లాగుతాయి. దీనిని ‘హార్డ్ ఎంక్వైరీ’ అంటారు. ఇలాంటివి ఎక్కువగా ఉంటే, మీరు ‘క్రెడిట్ హంగ్రీ’ (అప్పుల కోసం ఆత్రుతగా ఉన్నవారు) అని భావించి, బ్యాంకులు మీ స్కోరును తగ్గిస్తాయి.
4. ఇతరుల హామీ.. మీ స్కోరుకు హాని! (Co-Applicant Risk) : మీరు ఇతరుల లోన్‌కు సహ-దరఖాస్తుదారుగా (Co-applicant) లేదా గ్యారెంటర్‌గా ఉన్నారా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, అసలు రుణగ్రహీత ఈఎంఐలు సరిగ్గా చెల్లించకపోయినా, దాని ప్రభావం నేరుగా మీ క్రెడిట్ స్కోరుపై పడుతుంది. చట్ట ప్రకారం, మీరు కూడా ఆ రుణానికి సమాన బాధ్యులే.
5. రిపోర్టు చూడకపోవడం.. పొరపాట్లను మోయడం! (Ignoring Credit Report) :
చాలామంది కేవలం తమ క్రెడిట్ స్కోరును మాత్రమే చూసి వదిలేస్తారు. కానీ, పూర్తి క్రెడిట్ రిపోర్టును క్షుణ్ణంగా తనిఖీ చేయరు. కొన్నిసార్లు బ్యాంకు సిబ్బంది పొరపాట్ల వల్ల, మీరు తీసుకోని రుణం మీ ఖాతాలో కనిపించవచ్చు లేదా మీరు పూర్తిగా చెల్లించిన రుణం ఇంకా యాక్టివ్‌గా ఉన్నట్లు చూపించవచ్చు. ఇలాంటి పొరపాట్లను గుర్తించి, సరిదిద్దుకోనంత వరకు మీ స్కోరు మెరుగుపడదు.
ఉచితంగా తెలుసుకోండి : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం, ప్రతీ వ్యక్తి ఏడాదికి ఒకసారి ప్రముఖ క్రెడిట్ బ్యూరోల (CIBIL, Experian, Equifax వంటివి) నుంచి తమ పూర్తి క్రెడిట్ రిపోర్టును ఉచితంగా పొందే హక్కు ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, మీ రిపోర్టును నిశితంగా పరిశీలించి, తప్పులను సరిదిద్దుకుంటే మీ క్రెడిట్ స్కోరు కచ్చితంగా మెరుగవుతుంది.


