US Tariffs: భారత్- అమెరికా మధ్య సుంకాలపై యుద్ధం జరుగుతోంది. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా 50శాతం సుంకాలను విధించింది. ఈ చర్యపై (US Tariffs) ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామం దేశంలోని కీలక ఎగుమతి రంగాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసింది. దీనివల్ల దేశవ్యాప్తంగా లక్షలాది కార్మికుల జీవనోపాధిని కూడా ప్రమాదంలో పడేస్తుందని పేర్కొంది. ముఖ్యంగా జౌళి, తోలు, ముత్యాలు, ఆభరణాలు తదితర రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుందని సీటీఐ ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ ఆ లేఖలో పేర్కొన్నారు. “భారత వస్తువులపై ఆగస్టు 7న 25శాతం సుంకాలు అమలు చేస్తున్న ట్రంప్ (Donald Trump) యంత్రాంగం.. ఆగస్టు 27 నుంచి మరో 25శాతం సుంకాలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో పదిశాతంగా ఉన్న సుంకాలు ఇప్పుడు యాభై శాతానికి పెరిగింది. దీంతో న్యూఢిల్లీకి పోటీగా ఉన్న వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాల ఉత్పత్తులతో పోలిస్తే అమెరికా మార్కెట్‌లో భారత వస్తువుల ధరలు గణనీయంగా పెరగనున్నాయి” అని గోయల్ పేర్కొన్నారు.
Read Also: Shepherd: ఒక్క బాల్.. 20 పరుగులు.. వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ సంచలనం
ప్రమాదంలో ఎగుమతులు..
అమెరికా సుంకాలతో 48 బిలియన్ డాలర్ల (రూ.4 లక్షల కోట్ల) విలువైన ఎగుమతులు ప్రమాదంలో ఉన్నాయని సీటీఐ అంచనా వేసింది. వీటిలో రూ.1.7 లక్షల కోట్ల విలువైన ఇంజినీరింగ్ గూడ్స్, రూ.90వేల కోట్ల ముత్యాలు, ఆభరణాలు, రూ.92వేల కోట్ల ఫార్మాతోపాటు పలు రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయని తెలిపింది. మన ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకే అమెరికా ఇటువంటి చర్యలకు దిగుతోందని, ఇందుకు భారత్ భయపడవద్దని సీటీఐ ఛైర్మన్ గోయల్ అభిప్రాయపడ్డారు. అమెరికా ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని, జర్మనీ, యూకే, సింగపూర్, మలేసియా వంటి దేశాల్లో కొత్త మార్కెట్లను వెతుక్కోవాలని సూచించారు. అక్కడ ఇంజినీరింగ్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో స్పష్టమైన వైఖరి తీసుకొని అమెరికా ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు విధించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ విధంగానైనా అమెరికాకు మనం ఓ గుణపాఠం చెప్పాలన్నారు.
Read Also: Heavy Rains: కామారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం.. పలుచోట్ల రహదారుల మూసివేత
ఆగస్టు 27 నుంచి అమల్లో..
ఇప్పటికే అక్కడికి పంపించిన, ప్రస్తుతం రవాణాలో ఉన్న వస్తువుల భవితవ్యం ఏంటనే విషయంపై భారత ఎగుమతి దారుల్లో ఆందోళన నెలకొందని సీటీఐ కార్యదర్శులు రాహుల్ అద్లాఖా, రాజేశ్ ఖన్నాలు పేర్కొన్నారు. అయితే, వీటికి సంబంధించి అమెరికా హోంలాండ్ భద్రతా విభాగం దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం తెల్లవారుజామున 12.01 గంటల్లోగా (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటలు) ఓడల్లో లోడ్ చేసిన ఉత్పత్తులకు, రవాణాలో ఉన్న వాటికి అదనపు సుంకాలు వర్తించవని పేర్కొంది.


