World Economic Forum 2026 security : మంచు దుప్పటి కప్పుకున్న స్వర్గం.. కానీ అడుగడుగునా సైనిక కవాతు! స్విట్జర్లాండ్‌లోని ప్రశాంతమైన దావోస్ పట్టణం ఇప్పుడు అపూర్వ భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. ప్రపంచ భవిష్యత్తును నిర్దేశించే హేమాహేమీలంతా ఒక్కచోట చేరడంతో, ఆ చిన్న పట్టణం ఓ సైనిక కోటను తలపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వరకు, ప్రపంచ రాజకీయ, వాణిజ్య దిగ్గజాల రాకతో, దావోస్ భారీ భద్రతా ఏర్పాట్లతో కిటకిటలాడుతోంది. అసలు ఇంతటి కట్టుదిట్టమైన భద్రత ఎందుకు..? ఈ ఐదు రోజుల సదస్సులో ఏం చర్చించబోతున్నారు..?
కోటలా మారిన దావోస్ : ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సమావేశం-2026, జనవరి 19, సోమవారం నుంచి దావోస్‌లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, ప్రపంచ నేతల భద్రత కోసం స్విస్ ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా ఏర్పాట్లు చేసింది.
5,000 మంది సైన్యం: 5,000 మందికి పైగా సైనిక సిబ్బంది, వ్యూహాత్మక ప్రాంతాలలో స్నైపర్లు, ఏఐ (AI) ఆధారిత డ్రోన్లతో పట్టణాన్ని జల్లెడ పడుతున్నారు. గూఢచర్యం, స్పైవేర్‌లను ఎదుర్కోవడానికి ప్రత్యేక సాంకేతిక సాధనాలను మోహరించారు. పట్టణంలోకి వచ్చే అన్ని మార్గాలలో, పలు ఇతర ప్రాంతాలలో విస్తృతమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఐదు రోజుల సదస్సులో, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులు పాల్గొంటున్నారు.
రాజకీయ నేతలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, జర్మన్ ఛాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, చైనా వైస్-ప్రీమియర్ హి లైఫెంగ్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సహా 64 మంది దేశాధినేతలు, మొత్తం 400 మందికి పైగా రాజకీయ నాయకులు హాజరవుతున్నారు.
సంస్థల అధిపతులు: ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO), ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF), నాటో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వంటి కీలక అంతర్జాతీయ సంస్థల అధిపతులు పాల్గొంటున్నారు. వెయ్యి మందికి పైగా సీఈఓలు, పౌర సమాజ ప్రతినిధులు, విద్యావేత్తలు, 500 మందికి పైగా పాత్రికేయులు ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నారు.
నిరసనల సెగ.. అధికారుల ఆందోళన : ఈ సదస్సు నేపథ్యంలో, భద్రతా ఏజెన్సీల ఆందోళనలను మరింత పెంచుతూ, కొన్ని నిరసనలకు కూడా పిలుపునిచ్చారు. పెట్టుబడిదారీ విధాన వ్యతిరేకులు, పర్యావరణ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించే అవకాశం ఉండటంతో, భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లపై చర్చించేందుకు, ప్రపంచ పెద్దలంతా ఒకచోట చేరుతున్న ఈ సదస్సుపై, యావత్ ప్రపంచం ఆసక్తిగా దృష్టి సారించింది.

