RBI : డిజిటల్ చెల్లింపుల విషయంలో భారత దేశం మరో విప్లవాత్మక అడుగు వేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫాస్టాగ్ వినియోగదారులకు శుభవార్త చెబుతూ, ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025లో ఆఫ్‌లైన్ డిజిటల్ రూపాయి (e₹) ను అధికారికంగా ప్రారంభించింది. ఈ సదుపాయంతో ఇకపై ఇంటర్నెట్ సౌకర్యం లేకున్నా, మారుమూల ప్రాంతాల్లోనూ చెల్లింపులు చేయవచ్చు.
డిజిటల్ రూపాయి (e₹) అంటే ఏమిటి?
e₹ అనేది భారత సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) – అంటే, మన సాధారణ రూపాయికి డిజిటల్ వెర్షన్. దీనిని RBI నేరుగా జారీ చేస్తుంది. ఈ డబ్బు సాధారణ బ్యాంకు ఖాతాలో కాకుండా, RBI అనుమతించిన ప్రత్యేక డిజిటల్ వాలెట్‌లో నిల్వ చేయబడుతుంది.
వినియోగదారులు బ్యాంకు ఖాతా లేకుండానే ఈ e₹ ను ఉపయోగించవచ్చు. తక్షణ డబ్బు బదిలీలు (P2P), వ్యాపారాలకు QR కోడ్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఇది ఆర్థిక చేరికను మరింత విస్తరించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
15 ప్రధాన బ్యాంకుల ద్వారా CBDC సేవలు
ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ICICI బ్యాంక్, HDFC, యస్ బ్యాంక్ సహా మొత్తం 15 ప్రధాన బ్యాంకులు RBI యొక్క రిటైల్ CBDC పైలట్ ప్రాజెక్ట్‌లో భాగమై ఉన్నాయి. వినియోగదారులు ఈ బ్యాంకుల e₹ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని నమోదు చేసుకోవచ్చు.
ఆఫ్‌లైన్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
గ్రామీణ మరియు తక్కువ నెట్‌వర్క్ కవరేజ్ ఉన్న ప్రాంతాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ ఆఫ్‌లైన్ ఫీచర్ రెండు వినూత్న పద్ధతుల్లో పనిచేస్తుంది. అతి తక్కువ సిగ్నల్ ఉన్నా కూడా ఈ విధానంలో లావాదేవీలు పూర్తవుతాయి.ఇంటర్నెట్ లేకపోయినా, రెండు ఫోన్‌ల మధ్య దగ్గరగా ఉంచి ‘ట్యాప్ టు పే’ (Tap to Pay) పద్ధతిలో తక్షణమే లావాదేవీలు జరపవచ్చు.ఈ విప్లవాత్మక మార్పుతో ఇంటర్నెట్ లేకుండానే రియల్ టైమ్ చెల్లింపులు సులభమవుతాయి.
ప్రోగ్రామబుల్ కరెన్సీ – భవిష్యత్తు ఇదే
e₹ కేవలం డిజిటల్ మనీ మాత్రమే కాదు; ఇది ప్రోగ్రామబుల్ కరెన్సీ. అంటే, ఈ నిధులను ప్రభుత్వం లేదా సంస్థలు ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించేలా పరిమితం చేయవచ్చు.గుజరాత్ ‘G-SAFAL’ పథకంలో రైతుల కోసం వ్యవసాయ ఇన్‌పుట్‌లకే పరిమితమైన e₹, ఆంధ్రప్రదేశ్ ‘దీపం 2.0’ పథకంలో LPG సబ్సిడీ కోసం మాత్రమే ఉపయోగించే e₹.ఇది భవిష్యత్తులో ప్రభుత్వ సబ్సిడీ పంపిణీ, కార్పొరేట్ చెల్లింపులు, లక్ష్యిత రుణాలు (Targeted Loans) వంటి వాటిలో కీలక పాత్ర పోషించనుంది.
భారతదేశం DPI పవర్ హౌస్
RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ, ఆధార్, యూపీఐ, డిజిలాకర్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI) కారణంగా భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి ఫిన్‌టెక్ దేశంగా ఎదిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో, డిజిటల్ రూపాయి ఆర్థిక వ్యవస్థకు కొత్త బలం అందిస్తుందని, ఇంటర్నెట్ యాక్సెస్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు ఇది ‘డిజిటల్ క్యాష్’ అనుభవాన్ని ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆఫ్‌లైన్ e₹ రాకతో, భారతదేశం ప్రపంచంలోనే అత్యంత డిజిటల్ కరెన్సీ-ఫ్రెండ్లీ దేశాలలో ఒకటిగా నిలవబోతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పు అనడంలో సందేహం లేదు.


