Sunday, February 8, 2026
Homeబిజినెస్Gig Workers : ఆన్‌లైన్ డెలివరీ వర్కర్ల వెతలు.. ఆర్థిక సర్వేలో దిగ్భ్రాంతికర నిజాలు

Gig Workers : ఆన్‌లైన్ డెలివరీ వర్కర్ల వెతలు.. ఆర్థిక సర్వేలో దిగ్భ్రాంతికర నిజాలు

Economic Survey 2026: ఆర్థిక సర్వే 2026 వెలువరించిన గణాంకాలు దేశంలోని గిగ్ వర్కర్ల దయనీయ స్థితికి అద్దం పడుతున్నాయి. ఆధునిక కాలంలో గిగ్ ఎకానమీ (తాత్కాలిక లేదా ఫ్రీలాన్స్ పనులు) ఒక విప్లవంలా దూసుకుపోతున్నా, ఆ విప్లవానికి వెన్నెముకగా ఉన్న డెలివరీ వర్కర్ల జీవితాల్లో మాత్రం వెలుగులు నిండడం లేదని ఈ సర్వే స్పష్టం చేసింది.నేడు స్మార్ట్‌ఫోన్‌లో ఒక చిన్న క్లిక్ చేస్తే చాలు.. వేడివేడి బిర్యానీ నుంచి ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువుల వరకు అన్నీ నిమిషాల్లో ముంగిట ప్రత్యక్షమవుతున్నాయి. ఈ వేగవంతమైన సేవ వెనుక లక్షల మంది గిగ్ వర్కర్ల చెమట చుక్కలు దాగి ఉన్నాయి. కానీ, తాజాగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2026 ఒక చేదు నిజాన్ని బయటపెట్టింది.

- Advertisement -

భారతదేశంలో గిగ్ ఎకానమీ భారీగా విస్తరిస్తున్నా, అందులో పనిచేసే వారి ఆర్థిక పరిస్థితి మాత్రం దిగజారుతోందని సర్వే పేర్కొంది.దేశంలోని ఆన్‌లైన్ డెలివరీ వర్కర్లలో దాదాపు 40 శాతం మంది నెలకు రూ.15 వేల కంటే తక్కువ ఆదాయంతోనే సరిపెట్టుకుంటున్నారు. పెరుగుతున్న ధరల దృష్ట్యా ఈ మొత్తం ఒక కుటుంబం గడవడానికి ఏమాత్రం సరిపోదని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది.ఆర్డర్ కోసం ఒక డెలివరీ బాయ్ ఎదురుచూసే సమయానికి ఎటువంటి పరిహారం అందడం లేదు. దీనివల్ల వారి శ్రమకు తగిన గుర్తింపు లభించడం లేదని నివేదిక స్పష్టం చేసింది. పీఎఫ్, ఈఎస్ఐ లేదా ఇన్సూరెన్స్ వంటి కనీస సామాజిక భద్రతా ప్రయోజనాలు వీరికి అందకపోవడం మరో ప్రధాన సమస్య.

Supreme Court: వీధి కుక్కలపై సమస్యపై సుప్రీంకోర్టు విచారణ పూర్తి.. తీర్పు రిజర్వ్‌.!

 

జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ వంటి సంస్థలు మార్కెట్ లీడర్లుగా ఎదుగుతూ కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తున్నాయి. అయితే, ఆ సంస్థల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్లు మాత్రం తమ హక్కుల కోసం రోడ్లపైకి రావాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్స్‌లో వీరి కోసం కొన్ని నిబంధనలు ఉన్నప్పటికీ, అవి పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ అసమానతలను తొలగించడానికి ఆర్థిక సర్వే కొన్ని కీలక మార్పులను ప్రతిపాదించింది.పని చేసే గంటల ఆధారంగా లేదా ప్రతి ఆర్డర్ ప్రాతిపదికన ఒక నిర్దిష్ట ‘కనీస ఆదాయాన్ని’ గిగ్ వర్కర్లకు హామీ ఇవ్వాలి. ఆర్డర్ వచ్చే వరకు వర్కర్లు వేచి ఉండే సమయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని పరిహారం అందించాలి. గిగ్ వర్కర్లను కేవలం ‘భాగస్వాములు’గానే కాకుండా, వారికి ఉండాల్సిన హక్కుల విషయంలో ఇతర ఉద్యోగులతో సమానంగా చూడాలని పేర్కొంది.

గిగ్ ఎకానమీ అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తున్న మాట వాస్తవమే. కానీ, ఆ వ్యవస్థను నడిపిస్తున్న సామాన్యుడి కడుపు కాలకుండా చూడాల్సిన బాధ్యత అటు కంపెనీల మీద, ఇటు ప్రభుత్వం మీద ఉంది. కేవలం ‘డిజిటల్ ఇండియా’ అని మురిసిపోతే సరిపోదు.. డెలివరీ వర్కర్ల కళ్ళలో ఆనందం చూసినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News