Saturday, November 15, 2025
Homeబిజినెస్Anil Ambani Assets : అనిల్ అంబానీకి ఈడీ భారీ షాక్: రూ.3,000 కోట్ల ఆస్తులు...

Anil Ambani Assets : అనిల్ అంబానీకి ఈడీ భారీ షాక్: రూ.3,000 కోట్ల ఆస్తులు జప్తు!

Anil Ambani ED case :  పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. ఆయన గ్రూప్ కంపెనీలపై నమోదైన మనీలాండరింగ్ కేసులో భాగంగా, ఏకంగా రూ.3,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ కేసులో ఈడీ దూకుడు పెంచింది. అసలు ఈ వేల కోట్ల కుంభకోణం ఏమిటి..? అనిల్ అంబానీ మెడకు చుట్టుకున్న ఈ కేసు పూర్వాపరాలేంటి..? ఆ వివరాల్లోకి వెళ్తే..

- Advertisement -

ముంబై బంగ్లా నుంచి దిల్లీ ప్లాట్ వరకు జప్తు : సోమవారం, ఈడీ అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద నాలుగు తాత్కాలిక ఉత్తర్వులను జారీ చేసి, ఈ ఆస్తులను అటాచ్ చేశారు. జప్తు చేసిన ఆస్తుల్లో ముంబైలోని పాలీ హిల్‌లో ఉన్న అనిల్ అంబానీ (66) విలాసవంతమైన నివాస గృహం కూడా ఉంది. దీనితో పాటు, దిల్లీలోని మహారాజా రంజిత్ సింగ్ మార్గ్‌లో ఉన్న రిలయన్స్ సెంటర్‌కు చెందిన భూమి, నోయిడా, ఘజియాబాద్, పుణె, థానె, హైదరాబాద్, చెన్నై, తూర్పు గోదావరి జిల్లాల్లోని పలు వాణిజ్య, నివాస భవనాలను కూడా ఈడీ అటాచ్ చేసింది. ఈ ఆస్తుల మొత్తం విలువ రూ.3,084 కోట్లుగా అధికారులు నిర్ధారించారు.

కేసు పూర్వాపరాలు.. నిధుల మళ్లింపు ఆరోపణలు : అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (RCFL) సంస్థలు ప్రజల నుంచి సేకరించిన నిధులను అక్రమంగా మళ్లించి, మనీలాండరింగ్‌కు పాల్పడ్డాయన్నది ప్రధాన ఆరోపణ. ఈడీ దర్యాప్తు ప్రకారం, 2017-19 మధ్యకాలంలో యెస్ బ్యాంక్.. RHFLలో రూ.2,965 కోట్లు, RCFLలో రూ.2,045 కోట్ల చొప్పున పెట్టుబడులు పెట్టింది. అయితే, డిసెంబర్ 2019 నాటికి ఈ పెట్టుబడులన్నీ నిరర్థక ఆస్తులుగా (NPAs) మారిపోయాయి. ఆ సమయానికి RHFL నుంచి రూ.1,353 కోట్లు, RCFL నుంచి రూ.1,984 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి.

రూ.17,000 కోట్లపై దర్యాప్తు : ఈ కేసులో భాగంగా, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో సహా పలు గ్రూప్ కంపెనీలు సమిష్టిగా రూ.17,000 కోట్లకు పైగా రుణాలను పక్కదారి పట్టించాయని ఈడీ ఆరోపిస్తోంది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ మనీలాండరింగ్ కేసు దర్యాప్తును ప్రారంభించింది. ఈ కేసు విచారణలో భాగంగా ఈ ఏడాది ఆగస్టులో అనిల్ అంబానీని ఈడీ ప్రశ్నించింది. అంతకుముందు జులై 24న, ముంబైలో ఆయన గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా 25 మంది వ్యక్తులు, 50 కంపెనీలకు చెందిన 35 ప్రాంగణాల్లో ఈడీ విస్తృత సోదాలు నిర్వహించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad