Electric Cars Resale: చూడటానికి ఎలక్ట్రిక్ కార్లు భవిష్యత్తు అనిపిస్తున్నా.. వాటి రీసేల్ విలువ మాత్రం వెనక్కి నడుస్తోంది. యూజ్డ్ ఎలక్ట్రిక్ వాహనాలు పెట్రోల్, డీజల్ కార్ల కంటే దాదాపు రెండింతల వేగంగా విలువ కోల్పోతున్నాయని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా వెల్లడించారు. అయితే దీనికి ప్రధాన కారణం బ్యాటరీ అని వెల్లడించారు. ఎలక్ట్రిక్ కార్ల విలువ రెండేళ్లలోనే దాదాపు 42 శాతం పడిపోతోందని, ఇదే క్రమంలో ఇంధనంతో నడిచే కార్ల విలువ కేవలం 20 శాతం మాత్రమే తగ్గుతున్నట్లు అహుజా అన్నారు. సెకండ్ హ్యాంక్ ఈవీ కొనుగోలుదారులు ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలని ఆయన హెచ్చరిస్తున్నారు.
విలువ పతనం వెనుక ప్రధాన కారణం.. బ్యాటరీ ఆరోగ్యంపై స్పష్టత లేకపోవడమేనని చెప్పారు. ఒక ఎలక్ట్రిక్ వాహనంలో బ్యాటరీ ఖర్చు మొత్తం ధరలో 30–40% వరకు ఉంటుంది. అయితే వాడిన కార్ల మార్కెట్లో ఆ బ్యాటరీ ఎంత ‘హెల్తీ’గా ఉందో తెలుసుకునే అవకాశం లేకపోవటం పెద్ద ప్రమాదంగా ఉంది. ప్రతి కంపెనీ తమ సొంత సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తుంది కాబట్టి, కొనుగోలుదారులకు నమ్మకం కలగడం కష్టమే. కొన్నేళ్ల కిందట వాడిన సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనటానికి ప్రజలు దూరంగా ఉండేవారని.. అదే పరిస్థితి ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల విషయంలోనూ కనిపిస్తోందని అహుజా చెప్పారు. అయితే దీనికి ప్రధాన కారణం బ్యాటరీ హెల్త్, లైఫ్, పనితీరు వంటివేనని అన్నారు. పైగా బ్యాటరీ రేంజ్ కూడా పాతపడే కొద్ది తగ్గుతుందని తెలిసిందే అంటున్నారు అహుజా.
అయితే రీసేల్ విలువను కాపాడుకోవడానికి అహుజా 3 సూచనలు:
1. బ్యాటరీ వారంటీ వివరాలు తెలుసుకోండి. కొన్ని కంపెనీలు, ఉదాహరణకు BYD, 8 సంవత్సరాల వారంటీ ఇస్తోంది. టాటా మోటార్స్ 15 సంవత్సరాల వరకు కొన్ని మోడళ్లపై ఆఫర్ చేస్తోంది. కానీ ఇది ఎక్కువగా ఫస్ట్ ఓనర్లకే వర్తిస్తుందని గమనించాలి.
2. బ్యాటరీ మార్చడం లేదా అద్దెకు తీసుకోవడం సాధ్యమా చూడండి. MG వంటి కంపెనీలు ‘Battery as a Service (BaaS)’ మోడల్ కింద కిలోమీటర్ ప్రాతిపదికపై అద్దె వ్యవస్థ అందిస్తున్నాయి.
3. వాడిన ఎలక్ట్రిక్ వాహనం కొంటే ‘బ్యాటరీ హెల్త్ సర్టిఫికేట్’ తీసుకోవాలి. కంపెనీ ఇచ్చే ‘State of Health’ సర్టిఫికేట్‌లో ప్రతి సంవత్సరం 2% కంటే తక్కువ డిగ్రేడేషన్ ఉండాలని అహుజా సూచిస్తున్నారు.
చివరగా “సర్టిఫైడ్ ప్రీ-ఓన్డ్ EV తీసుకుంటే సురక్షితం” అని కొనుగోలుదారులకు అహుజా సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రజల్లో ఖర్చు తగ్గించుకోవాలి అనే ఆలోచనల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరుగుతున్నప్పటికీ.. దీర్ఘకాల రీసేల్ విలువపై ఉన్న సందేహాలు మాత్రం కొనసాగే అవకాశముంది. అందుకే బ్యాటరీ నిబంధనలు, వారంటీ వివరాలు, సర్వీస్ సౌకర్యాలు భవిష్యత్తులో EV కొనుగోలు నిర్ణయానికి ప్రధాన పాత్ర పోషించనున్నాయి.


