Saturday, November 15, 2025
Homeబిజినెస్Entrepreneur: ఆటో డ్రైవర్ To రూ.31 లక్షల ఫ్యాన్సీ నంబర్ యజమాని

Entrepreneur: ఆటో డ్రైవర్ To రూ.31 లక్షల ఫ్యాన్సీ నంబర్ యజమాని

Rahul Taneja: ఒకప్పుడు పూట గడవడమే గగనమైన జీవితం… ఇప్పుడు తన కొడుకు కోసం ఏకంగా రూ. 31 లక్షలు వెచ్చించి అత్యంత ఖరీదైన లగ్జరీ నంబర్‌ను సొంతం చేసుకునే స్థాయికి ఎదిగిన ఒక వ్యాపారవేత్త స్ఫూర్తిదాయక గాథ ఇది. జైపూర్‌కు చెందిన రాహుల్ తనేజా సృష్టించిన ఈ రికార్డు ఇప్పుడు రాజస్థాన్ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

- Advertisement -

కొడుకు కోసం రికార్డు బ్రేక్
రాహుల్ తనేజా తన కుమారుడు రెహాన్ త్వరలో 18వ పుట్టినరోజు (నవంబర్ 16) జరుపుకోనున్న సందర్భంగా, అతడికి జీవితాంతం గుర్తుండిపోయే బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. సరికొత్త ఆడి ఆర్‌ఎస్‌క్యూ8 కారును కొనుగోలు చేసిన ఆయన, దానికి ప్రత్యేకంగా ‘RJ 60 CM 0001’ అనే వీఐపీ నంబర్‌ను దక్కించుకోవడం కోసం జైపూర్ రవాణా కార్యాలయం నిర్వహించిన వేలంలో పాల్గొన్నారు. చివరికి, ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ. 31 లక్షలు చెల్లించి ఆ నంబర్‌ను సొంతం చేసుకున్నారు. ఇది రాజస్థాన్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్ నంబర్‌గా అధికారికంగా నమోదైంది. కొడుకుకు ఏడేళ్ల క్రితం ఇచ్చిన మాట ప్రకారం ఈ బహుమతి ఇవ్వడం ఈ ప్రేమకు ఉన్న విలువను తెలియజేస్తుంది.

ఆటో నుండి లగ్జరీ ప్యాలెస్ వరకు… కష్టాల ప్రయాణం
రాహుల్ తనేజా ఈ స్థాయికి ఎదగడం వెనుక ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన ఆయన తండ్రి సైకిల్ పంక్చర్ దుకాణాన్ని నడిపేవారు. 11 ఏళ్ల పిన్న వయసులోనే జైపూర్‌లోని ఒక దాబాలో వెయిటర్‌గా పనిచేయడం మొదలుపెట్టారు. పండుగలకు పటాకులు, గాలిపటాలు అమ్ముకుంటూ కుటుంబానికి అండగా నిలిచారు. పగలంతా కొరియర్ బాయ్‌గా, న్యూస్‌పేపర్ డెలివరీ చేస్తూ, రాత్రి 9 నుండి 12 గంటల వరకు ఆటో నడుపుతూ తన జీవనం సాగించారు.

19 ఏళ్లకే కష్టపడి కూడబెట్టిన డబ్బుతో ‘కార్ ప్యాలెస్’ అనే చిన్న డీలర్‌షిప్‌ను స్థాపించారు. తన పట్టుదలతో మోడలింగ్‌లో రాణించి ‘మిస్టర్ జైపూర్’, ‘మిస్టర్ రాజస్థాన్’ టైటిళ్లను గెలుచుకున్నారు. ఆ తర్వాత ఈవెంట్ మేనేజ్‌మెంట్ మరియు లగ్జరీ వెడ్డింగ్ ప్లానింగ్‌లో భారీ విజయాలు సాధించి, నేడు దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరిగా నిలిచారు.

నా సంతోషం వాడి సంతోషంలోనే
లగ్జరీ కార్లకు, ఫ్యాన్సీ నంబర్‌లకు భారీగా ఖర్చు చేయడం రాహుల్‌కు కొత్తేమీ కాదు. గతంలో బీఎండబ్ల్యూ కోసం రూ. 10 లక్షలు, జాగ్వార్ కోసం రూ. 16 లక్షలు వెచ్చించి నంబర్లను కొనుగోలు చేశారు.

రూ. 31 లక్షలు కేవలం కారు నంబర్‌పై ఖర్చు చేయడం గురించి అడగ్గా, రాహుల్ నవ్వుతూ ఇచ్చిన సమాధానం అందరి హృదయాలను హత్తుకుంది. “నేను వర్తమానంలో జీవించడానికి ఇష్టపడతాను. నాకు ఆనందాన్నిచ్చే పనులు చేస్తాను. నా సంతోషం అంతా నా కొడుకు సంతోషంలోనే ఉంది. వాడికి కార్లంటే, కారు నంబర్లంటే పిచ్చి. వాడి సంతోషం కోసం ఏదైనా చేసేటప్పుడు నేను పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను” అని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad