PF :చాలామంది ఉద్యోగుల్లో ఉండే ఒక అపోహ ఏంటంటే, ఉద్యోగం మానేసిన వెంటనే ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాపై వడ్డీ జమ ఆగిపోతుంది అని. అందుకే చాలామంది తమ PF మొత్తాన్ని వెంటనే విత్‌డ్రా చేసుకుంటారు. కానీ, ఇది మీరు చేసే పెద్ద తప్పు! ఇలా చేయడం ద్వారా మీరు సంవత్సరాల తరబడి రాబోయే భారీ వడ్డీ ఆదాయాన్ని కోల్పోతారు.
ఉద్యోగం మానేసినా, మీరు మీ PF మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోకపోతే… మీ ఖాతాపై వడ్డీ జమ కావడం కొనసాగుతుంది. EPFO నిబంధనల ప్రకారం, మీ PF ఖాతా 58 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు వడ్డీని సంపాదిస్తూనే ఉంటుంది.
ఉదాహరణకు, మీరు 40 ఏళ్ల వయస్సులోనే ఉద్యోగం మానేసినా, ఆ PF డబ్బు మరో 18 ఏళ్ల పాటు వడ్డీతో పెరుగుతూనే ఉంటుంది. ఈ వడ్డీ రేటు ప్రస్తుతం 8.25% గా ఉంది. ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD) లేదా ఇతర సాంప్రదాయ పెట్టుబడుల కంటే చాలా ఆకర్షణీయమైన రాబడిని అందిస్తుంది.
మీకు డబ్బు తక్షణమే అవసరం లేకపోతే, PF మొత్తాన్ని ఖాతాలో ఉంచడమే అత్యుత్తమ నిర్ణయం. దీనివల్ల చక్రవడ్డీ లాభం చేరి, పదవీ విరమణ సమయానికి మీ వద్ద చాలా పెద్ద మొత్తంలో నిధులు చేరతాయి. ఒకవేళ మీరు 58 ఏళ్ల తర్వాత కూడా వెంటనే డబ్బు తీసుకోకపోయినా, మీ ఖాతా మరో మూడు సంవత్సరాల వరకు (61 ఏళ్లు వచ్చే వరకు) వడ్డీని అందించే అవకాశం ఉంది.61 ఏళ్లు దాటిన తర్వాత మాత్రమే ఖాతా నిష్క్రియం (Inoperative) అవుతుంది. అప్పుడు వడ్డీ జమ ఆగిపోతుంది, కానీ మీ డబ్బు మాత్రం సురక్షితంగా ఉంటుంది.


