Mansukh Mandaviya : ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) చందాదారులకు కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. పీఎఫ్ నిధుల ఉపసంహరణ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు, సాధారణ బ్యాంక్ ఏటీఎంలు, యూపీఐ (UPI) ద్వారా సొమ్మును ఉపసంహరించుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ శుభవార్తను కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తాజాగా వెల్లడించారు.
పీఎఫ్ ఉపసంహరణ ఇక అత్యంత సులువు
ఒక ఆంగ్ల వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, “పీఎఫ్ సొమ్ము ప్రజల కష్టార్జితం. ఈ మొత్తాన్ని ఉపసంహరించుకొనే ప్రక్రియను మరింత సులభతరం చేయాలని మా ప్రభుత్వం చూస్తోంది.” అని తెలిపారు. ఈ కొత్త సదుపాయం 2026 మార్చి లోపు అందుబాటులోకి వస్తుందని ఆయన ధృవీకరించారు.
Also Read: CM Chandrababu – విశాంతి భద్రతలపై రాజీ పడను
ఏ కారణం చూపకుండా (Non-Refundable Advance) అత్యవసర సమయాల్లో చందాదారులు తమ పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం నిధిలోంచి 75 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. ప్రస్తుతం దీనికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంది. కొత్తగా ఏటీఎంల ద్వారా పీఎఫ్ విత్‌డ్రాకు సంబంధించిన ప్రక్రియ తుది దశలో ఉందని, అలాగే యూపీఐ ద్వారా కూడా విత్‌డ్రా చేసుకునే సదుపాయంపై పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు.
ఆధార్, యూఏఎన్ అనుసంధానంతో లబ్ధి
ప్రస్తుతం పీఎఫ్ సొమ్ము ఉపసంహరణ కోసం చందాదారులు అనేక పత్రాలు సమర్పించాల్సి వస్తోంది. దీన్ని తగ్గించడమే తమ ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఆధార్ మరియు యూఏఎన్ (UAN-Universal Account Number) అనుసంధానం కావడం వల్ల ఈ ప్రక్రియ మరింత సులభమవుతుంది. యూఏఎన్‌తో అనుసంధానమైన బ్యాంక్ ఖాతాకు డెబిట్ కార్డు అనుసంధానం చేయడం ద్వారా, చందాదారులు తమ బ్యాంక్ కార్డు ద్వారా ఏటీఎంలో పీఎఫ్ సొమ్మును విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి వస్తుంది.
విత్‌డ్రా నిబంధనల్లో భారీ సవరణ
ఈపీఎఫ్‌ఓ విత్‌డ్రాకు సంబంధించిన నిబంధనలను కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ ఏడాది అక్టోబర్‌లో సవరించింది. ఈ సవరణల వల్ల పీఎఫ్ నిధులు పాక్షికంగా ఉపసంహరించుకోవడం మరింత సులభమైంది.
గతంలో పాక్షిక ఉపసంహరణల కోసం 13 రకాల సంక్లిష్ట నిబంధనలు, కారణాలు ఉండేవి. ప్రస్తుతం వాటిని విలీనం చేసి కేవలం 3 విభాగాలుగా వర్గీకరించారు. విద్య, వివాహం వంటి సామాజిక అవసరాలు. గృహ నిర్మాణం, వైద్య చికిత్స వంటి వ్యక్తిగత ఆస్తుల నిర్వహణ. ఉద్యోగాన్ని కోల్పోవడం లేదా స్వయం ఉపాధి వంటి అవసరాలు.
ఈ మూడు కేటగిరీల కింద, అర్హత కలిగిన చందాదారులు తమ నిల్వల నుంచి మొత్తం సొమ్మును (ఉద్యోగి, యజమాని వాటాతో కలిపి) ఉపసంహరించుకోవచ్చు. అంతేకాక, 55 ఏళ్లు దాటిన తర్వాత రిటైర్‌మెంట్ లేదా 12 నెలల పాటు ఉద్యోగం లేకపోవడం వంటి పరిస్థితుల్లో కూడా ఆ మొత్తాన్ని ఉపసంహరించుకునే సదుపాయం ఉంది. ఈ మార్పులు కోట్లాది మంది ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తుకు మరింత భద్రత, సులభతరం చేయనున్నాయి.

