Sunday, November 16, 2025
Homeబిజినెస్EPFO: ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం.... ఉద్యోగంలో మరణిస్తే రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా!

EPFO: ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం…. ఉద్యోగంలో మరణిస్తే రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా!

EPFO death relief fund enhancement :  ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తమ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ ఒక కీలకమైన, చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సర్వీసులో ఉండగా మరణించిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ఉద్యోగుల కుటుంబాలకు అందించే డెత్ రిలీఫ్ ఫండ్ ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని భారీగా పెంచింది. ఈ నిర్ణయంతో ఇకపై మరణించిన ఉద్యోగి కుటుంబానికి ఇప్పటివరకు అందుతున్న మొత్తం కన్నా దాదాపు రెట్టింపు భరోసా లభించనుంది.

- Advertisement -

ఉద్యోగుల భవిష్యత్తుకు బంగారు బాట వేసే ప్రావిడెంట్ ఫండ్, వారి కుటుంబాలకు కష్టకాలంలో నేనున్నానంటూ భరోసానిస్తుంది. ఈ భరోసాను మరింత పటిష్టం చేస్తూ, ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఒక కీలక తీర్మానానికి ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు ఆగస్టు 19న ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది.

అసలు సిసలైన మార్పులివే..
ఎక్స్‌గ్రేషియా డబుల్ ధమాకా: ఇప్పటివరకు సర్వీసులో ఉండగా ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ఉద్యోగి మరణిస్తే, వారి కుటుంబానికి (నామినీ లేదా చట్టపరమైన వారసులకు) సిబ్బంది సంక్షేమ నిధి నుంచి రూ. 8.8 లక్షల ఎక్స్‌గ్రేషియా అందేది.తాజా నిర్ణయంతో ఈ మొత్తాన్ని ఏకంగా రూ. 15 లక్షలకు పెంచారు.  ఇది మృతుల కుటుంబాలకు ఆర్థిక ఆసరా అనడంలో సందేహం లేదు.

అమలు ఎప్పటినుంచంటే : ఈ పెంచిన ఎక్స్‌గ్రేషియా మొత్తం 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. అంటే, ఈ తేదీ లేదా ఆ తర్వాత మరణించిన అర్హులైన ఉద్యోగుల కుటుంబాలకు పాత మొత్తం స్థానంలో కొత్తగా పెరిగిన రూ. 15 లక్షలు చెల్లిస్తారు.

ఏటా 5% వృద్ధి – భవిష్యత్తుకు భరోసా: కేవలం ఒక్కసారి పెంచి ఊరుకోకుండా, భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుని ఈపీఎఫ్ఓ మరో ముందుడుగు వేసింది. 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ ఎక్స్‌గ్రేషియా మొత్తంపై ఏటా 5 శాతం చొప్పున పెంపు ఉంటుందని ప్రకటించింది. దీనివల్ల కాలక్రమేణా ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని, కుటుంబాలకు అందే ఆర్థిక సహాయం విలువ పెరుగుతూ ఉంటుంది.

2025లో ఈపీఎఫ్ఓ తెచ్చిన ఇతర కీలక సంస్కరణలు: ఈపీఎఫ్ఓ కేవలం ఎక్స్‌గ్రేషియా పెంపుకే పరిమితం కాకుండా.. 2025లో మరికొన్ని ముఖ్యమైన మార్పులను కూడా ప్రవేశపెట్టింది.

మైనర్ల డెత్ క్లెయిమ్స్ సులభతరం: పీఎఫ్ ఖాతాదారుడు మరణించిన తర్వాత, ఆ డబ్బు మైనర్ పిల్లలకు చెందాల్సి వస్తే, గతంలో గార్డియన్‌షిప్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉండేది. ఇది క్లెయిమ్ ప్రక్రియలో తీవ్ర జాప్యానికి కారణమయ్యేది. ఇప్పుడు ఈ నిబంధనను తొలగించడంతో, మైనర్ నామినీలు వేగంగా, సులభంగా డబ్బును పొందేందుకు మార్గం సుగమమైంది.

జాయింట్ డిక్లరేషన్ ప్రక్రియ మరింత ఈజీ: యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)తో ఆధార్‌ను అనుసంధానం చేయని వారు లేదా ఆధార్ వివరాల్లో తప్పులను సరిదిద్దుకోవాలనుకునే సభ్యుల కోసం, జాయింట్ డిక్లరేషన్ ప్రక్రియను మరింత సరళతరం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad