EPFO News: ఉద్యోగుల సామాజిక భద్రత పెంపునకు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తమ తప్పనిసరి సభ్యత్వం కోసం వేతన పరిమితిని ప్రస్తుత ఉన్న రూ.15,000 నుండి రూ.25,000కి పెంచే ప్రతిపాదనను త్వరలో అమలు చేసే అవకాశముంది. ఈ నిర్ణయంపై ఫైనల్ డెసిషన్ డిసెంబర్ లేదా జనవరిలో జరగబోయే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో రావచ్చని సమాచారం.
ప్రస్తుతం నెలకు రూ.15,000 కంటే తక్కువ బేసిక్ పే పొందుతున్న ఉద్యోగులు తప్పనిసరిగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ లో చేర్చబడాలి. అయితే ఎక్కువ శాలరీ పొందుతున్న వారు ఈ పథకాల నుంచి తప్పుకునే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. పైన పేర్కొన్నట్లుగా బేసిక్ శాలరీ సీలింగ్ పెరిగితే అదనంగా కోటి మందికి పైగా ఉద్యోగులు EPFO పరిధిలోకి వస్తారని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ట్రేడ్ యూనియన్లు చాలా కాలంగా ఈ పెంపును కోరుతున్నాయి. మహానగరాల్లో పనిచేసే అనేక తక్కువ లేదా మధ్యస్థ నైపుణ్య ఉద్యోగుల నెల వేతనం రూ.15,000 కంటే ఎక్కువగా ఉండటం వల్ల వారు ఈ భద్రతా వ్యవస్థకు దూరమైనట్లు వాపోతున్నారు. కొత్త పరిమితి అమలైతే చాలా మందికి సామాజిక భద్రత వ్యవస్థలో చోటుదక్కుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఉద్యోగి, యజమాని ఇద్దరూ 12 శాతం చొప్పున ప్రావిడెంట్ ఫండ్‌కు చెల్లించాలి. ఉద్యోగి మొత్తం భాగం EPFలోకి వెళ్తుంటే.. యజమాని వాటాలో 3.67 శాతం EPFకు, 8.33 శాతం EPSకు కేటాయించబడుతోంది. వేతన పరిమితి పెరిగితే EPF, EPSలో కాంట్రిబ్యూషన్ పెరుగుతాయని అధికారు అంటున్నారు. ఫలితంగా ఉద్యోగులు రిటైర్మెంట్ సమయంలో అధిక పెన్షన్, వడ్డీ ప్రయోజనాలు పొందగలరు.
ప్రస్తుతం EPFO మొత్తం కార్పస్ దాదాపు రూ.26 లక్షల కోట్లు కాగా.. సుమారు 7.6 కోట్ల యాక్టివ్ సభ్యులు ఉన్నారు. ఈ ప్రతిపాదిత పెంపు భారత కార్మిక వర్గానికి మరింత దీర్ఘకాల ఆర్థిక భద్రతనందించే దిశగా ప్రగతిశీల చర్య. అయితే కొందరు ఉద్యోగులు చేతికి వచ్చే వేతనంపై ప్రభావం పడుతుందని అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశముందని న్యాయ నిపుణులు అంటున్నారు.


