EPFO rules change: పీఎఫ్ ఖాతాదారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకునే శుభవార్తను కేంద్రం అందించింది. ఉద్యోగుల భవిష్య నిధి నుంచి డబ్బు ఉపసంహరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న సంక్లిష్టమైన నిబంధనలకు స్వస్తి పలికి, పీఎఫ్ విత్‌డ్రాలను అత్యంత సులభతరం చేసింది. ఇకపై ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బు కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. కేవలం 12 నెలల సర్వీసు పూర్తి చేసిన వెంటనే.. ఖాతాలో ఉన్న మొత్తం బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే సువర్ణావకాశం లభించింది. ఇంకా ఉద్యోగం దొరకకపోతే మిగిలిన 25శాతం డబ్బును ఏడాది తర్వాత తీసుకోవడానికి అవకాశాన్ని కల్పించింది.
పెన్షన్ డబ్బులకు వెయిటింగ్: ఈపీఎఫ్‌వో తీసుకున్న కీలక నిర్ణయాలలో ఒకటి మాత్రం కొంత నిరాశను కలిగించేదిగా ఉంది. ఇక్కడ నిరాశ కలిగించే విషయం ఏంటంటే.. జాబ్ పోయిన తర్వాత మీ పెన్షన్ స్కీమ్ డబ్బులు తీసుకోవాలంటే ఇకపై కేవలం 2 నెలలు కాదు.. ఏకంగా 36 నెలలు ఆగాల్సి ఉంటుందని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పేర్కొంది. భవిష్యత్తులో మీకు లేదా మీ కుటుంబానికి పెన్షన్ ప్రయోజనాలు దక్కేలా చూసేందుకే ఈ మార్పును తీసుకువచ్చామని తెలిపింది. ఉద్యోగుల ఆర్థిక భద్రతను ప్రోత్సహించాలనేదే తమ లక్ష్యమని పేర్కొంది.
ప్రధాన మార్పులు ఇవే: అర్హత కాలం తగ్గింపు: గతంలో వేర్వేరు రకాల విత్‌డ్రాలకు ఏడేళ్ల వరకు ఉన్న అర్హత కాలాన్ని… ఇప్పుడు అన్ని రకాల ఉపసంహరణలకూ ఒకే విధంగా 12 నెలలకు కుదించారు. ఇది అత్యంత ముఖ్యమైన మార్పు. ఇకపై ఉద్యోగి విత్‌డ్రా చేసుకునే 75 శాతం మొత్తంలో, యజమాని వాటాను సైతం పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో కేవలం ఉద్యోగి వాటా మాత్రమే లభించేది. ఈ మార్పు కారణంగా ఉద్యోగి చేతికి అందే మొత్తం గతంలో కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో పీఎఫ్ ఖాతాదారులు, ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


