Electric Vehicles : ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) భవిష్యత్తుపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. కేవలం 4 నుండి 6 నెలల్లోనే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెట్రోల్‌తో నడిచే వాహనాలతో సమానం అవుతాయని ఆయన వెల్లడించారు. ఈ వార్త EV ప్రియులకు, పర్యావరణవేత్తలకు నిజమైన ధమాకా అనే చెప్పాలి.
ప్రస్తుతం టాటా నెక్సాన్ EV (రూ.12.49 లక్షలు), దాని పెట్రోల్ వేరియంట్ (రూ.7.31 లక్షలు) మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఈ అంతరాన్ని త్వరలో చెరిపేస్తామని గడ్కరీ హామీ ఇవ్వడం, భారత ఆటోమొబైల్ మార్కెట్లో భారీ మార్పులకు సంకేతం.
ఎందుకీ మార్పు? ఆర్థిక, పర్యావరణ కోణం
FICCI సదస్సులో గడ్కరీ మాట్లాడుతూ.. శిలాజ ఇంధనాలపై ఆధారపడటం దేశానికి ఆర్థిక భారంగా మారిందని, ఏటా ఇంధన దిగుమతులకే రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని నొక్కి చెప్పారు. ఈ ఆర్థిక భారాన్ని, పర్యావరణ ప్రమాదాన్ని తగ్గించాలంటే, స్వచ్ఛమైన శక్తికి మారడం అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాదు, రాబోయే ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న రూ.22 లక్షల కోట్ల మార్కెట్ పరిమాణం మరింతగా విస్తరించనుంది. EV బ్యాటరీల ఉత్పత్తి ఖర్చు తగ్గడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ఈ ధరల సమతుల్యత సాధ్యం కానుంది. ఇకపై, పెట్రోల్ కారు కొనాలా, EV కొనాలా అనే అయోమయం లేకుండా, అధిక ధర భయం లేకుండా ఎంచుకునే అవకాశం రానుంది.


