Yes Bank Forex Card Fraud: ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ యెస్ బ్యాంక్‌లో రూ. కోట్లలో అనధికార లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో రూ. 590 కోట్ల భారీ ఆర్థిక మోసం ఘటన మరువకముందే.. మరో బ్యాంకులో మోసపూరిత లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 5వేల మంది కస్టమర్ల డేటా చోరీకి గురైనట్లు ఆంగ్ల మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
Also Read: https://teluguprabha.net/top-stories/jagga-reddy-meets-aicc-president-mallikarjun-kharge-in-delhi/
యెస్ బ్యాంకులో ఇటీవల ఫోరెక్స్ కార్డ్(Forex Card) డేటా చోరీకి సంబంధించి భారీ మోసపూరిత లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. ఆ బ్యాంకులో సుమారు 5,000 మంది కస్టమర్ల ఫోరెక్స్ కార్డ్ డేటా చోరీకి గురైనట్లు నివేదికలు చెబుతున్నాయి. కస్టమర్ల సీవీవీ డేటాను ఉపయోగించి దాదాపు రూ. 2.55 కోట్ల (0.28 మిలియన్ డాలర్లు) విలువైన అనధికార లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన బ్యాంక్.. ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా, ఈ మోసాలు ప్రధానంగా లాటిన్ అమెరికా దేశాల్లోని వ్యాపారుల వద్ద జరిగినట్లు బ్యాంకు తెలిపింది. అక్కడ టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి లేకపోవడంతో నేరగాళ్లు దీనిని ఆసరాగా చేసుకుని రూ. కోట్లలో అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారు. మోసం ఘటన వెలుగు చూడటంతో వెంటనే లాటిన్ అమెరికా దేశం నుంచి ఇ- కామర్స్ లావాదేవీలు జరగకుండా యెస్ బ్యాంకు నిలిపివేసింది. అయితే ఆ తర్వాత అనధికార లావాదేవీల కోసం వందల సంఖ్యలో ప్రయత్నాలు జరిగినట్లు వెల్లడించింది.
మరోవైపు మోసానికి గురైన కస్టమర్లకు ఎలాంటి ఆర్థిక నష్టం ఉండబోదని బ్యాంకు యాజమాన్యం పేర్కొంది. బ్లాక్ చేసిన కార్డుల స్థానంలో కొత్త ఫోరెక్స్ కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. కాగా, బ్యాంకులో తలెత్తిన భద్రతా లోపాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. యెస్ బ్యాంక్‌ను వివరణ కోరింది. ఈ మేరకు బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌లకు సమన్లు జారీ చేసింది.

